ఒడిస్సియస్‌ ఒరిగింది

Intuitive Machines moon lander tipped over during touchdown - Sakshi

చంద్రుడిపై దిగగానే పడిపోయిన ల్యాండర్‌

వాషింగ్టన్‌: చంద్రునిపై కుదురుగా దిగని లాండర్ల జాబితాలోకి ఒడిస్సియస్‌ కూడా చేరింది. అమెరికాకు చెందిన ప్రైవేటు సంస్థ ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ ప్రయోగించిన ఈ ల్యాండర్‌ చంద్రుని ఉపరితలంపై దిగుతూనే ఓ పక్కకు పడిపోయింది. చంద్రుడి నేలకు సమాంతరంగా వాలిపోయింది. దాంతో ల్యాండర్‌ సమాచార వ్యవస్థల నుంచి సంకేతం అందుకోవడానికి కొన్ని నిమిషాల ముందు ల్యాండర్‌ పక్కకు పడిందని ఇంట్యూటివ్‌ మెషీన్స్‌ (ఏఎం) సీఈవో స్టీవ్‌ ఆల్టెమస్‌ ధ్రువీకరించారు.

అది నిర్దేశిత ప్రదేశంలోనో, ఆ దగ్గర్లోనో దిగి ఉంటుందన్నారు. ఒడిస్సియస్‌ నుంచి డేటా స్వీకరిస్తున్నట్టు ఏఎం, నాసా వెల్లడించాయి. అది మోసుకెళ్లిన పరికరాల్లో చాలా పేలోడ్స్‌ పని చేసే స్థితిలోనే ఉంటాయని భావిస్తున్నట్టు చెప్పాయి. జపాన్‌ అంతరిక్ష సంస్థ ‘జాక్సా’ తాజాగా పంపిన ‘మూన్‌ స్నైపర్‌’ ల్యాండర్‌ చంద్రుడి ఉపరితలంపై తలకిందులుగా దిగడం తెలిసిందే.

చంద్రుడి దక్షిణ ధ్రువ సమీపంలో ల్యాండర్‌ కాలుమోపిన ‘మాలాపెర్ట్‌ ఎ’ బిలం వాస్తవానికి ల్యాండింగ్‌కు ప్రమాదభరితమైన ప్రదేశం. కానీ చంద్రుడిపై శాశ్వత స్థావరం నెలకొల్పడానికి దోహదపడే గడ్డకట్టిన నీరు అక్కడ పుష్కలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆ చోటునే ఎన్నుకున్నారు. లాండింగ్‌కు 30 సెకండ్ల ముందు ఒడిస్సియస్‌లోని ‘ఈగిల్‌ కామ్‌’ ల్యాండర్‌ నుంచి దూరంగా వెళ్లి ల్యాండింగ్‌ ఘట్టాన్ని చిత్రీకరించాల్సి ఉంది.

కానీ నేవిగేషన్‌ అవసరాల దృష్ట్యా ల్యాండింగ్‌ సమయంలో కామ్‌ను స్విచాఫ్‌ చేశారు. ‘‘ఒడిస్సియస్‌ పొజిషనింగ్‌కు సంబంధించిన ఫొటో చాలా ముఖ్యం. అందుకోసం ఈగిల్‌ కామ్‌ను విడుదల చేసేందుకు ప్రయతి్నస్తున్నాం. అది సుమారు 8 మీటర్ల దూరం నుంచి ఒడిస్సియస్‌ను ఫొటో తీస్తుందని ఆశిస్తున్నాం’’ అని ఏఎం తెలిపింది.

అయితే లాండింగ్‌కు కాస్త ముందు చంద్రునిపై షోంబర్గర్‌ క్రేటర్‌ ప్రాంతాన్ని దాదాపు 10 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఒడిస్సియస్‌ ఫొటో తీసి పంపింది. సౌరఫలకాలు లాండర్‌ పై భాగంలో, యాంటెన్నా కింది భాగంలో ఉండిపోవటంతో దాన్నుంచి డేటా సేకరణ కూడా కష్టసాధ్యమవుతోంది. చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తున్న నాసా ఉపగ్రహం లూనార్‌ రీకానసన్స్‌ ఆర్బిటర్‌ (ఎల్‌ఆర్వో) త్వరలో ఒడిస్సియస్‌ ఆనుపానులు కనిపెట్టనుంది. ల్యాండర్‌ కచి్చతంగా ఏ ప్రాంతంలో ఉందో గుర్తించి ఫొటోలు తీయనుంది. 

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top