ఆమె'కు అవకాశమిస్తే.. సైన్స్ కు ఆకాశమే హద్దు | Sakshi
Sakshi News home page

ఆమె'కు అవకాశమిస్తే.. సైన్స్ కు ఆకాశమే హద్దు

Published Sun, Feb 11 2024 3:14 AM

International Day of Women and Girls in Science on February 11 2024 - Sakshi

(రమేష్‌ గోగికారి): ‘ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగం’ అంటూ ఎన్నో ఉపోద్ఘాతాలు.. రిజర్వేషన్ల కోసం పోరాటాలు.. ఎంతో కొంత మార్పు.. అయినా ఏదో వెలితి. కొన్ని రంగాలకే, ఓ స్థాయి వరకే మహిళలు పరిమితమవుతున్న పరిస్థితి. సైన్స్‌–టెక్నాలజీ రంగాల్లో, పరిశోధనల్లో వారు చాలా తక్కువ. మరి మహిళల మేధాశక్తి ఏమైనా తక్కువా? పురుషులతో సమానంగానేకాదు.. ఒకింత ఎక్కువే చేసి చూపగలమని నిరూపించిన మేరీ క్యూరీ వంటి శాస్త్రవేత్తలు ఎందరో. మహిళల భాగస్వామ్యం తక్కువగా ఉన్నప్పుడే ఇంత సాంకేతికత, అభివృద్ధి జరుగుతుంటే.. ‘ఆమె’ తోడుంటే ఇంకెంత గొప్ప ఆవిష్కరణలు వస్తాయో, మరెంత అభివృద్ధి సాధ్యమో. చేయాల్సిందల్లా.. ‘ఆమె’కు అవకాశమివ్వడమే.

రెండేళ్లపాటు ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్‌ మొదలు.. భవిష్యత్తుపై భయం రేపుతున్న వాతావరణ మార్పుల (క్లైమేట్‌ చేంజ్‌) వరకు ఎన్నో సవాళ్లు. వాటిని ఎదుర్కొనే మార్గాలు, పరిష్కారాలను చూపగలిగేది సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ. ప్రస్తుతం అత్యుత్తమ నైపుణ్యమున్న పరిశోధకుల కొరత ఈ రంగాలను వెంటాడుతోంది. ఇలాంటి సమయంలో ఆదుకోగలిగినది మహిళా శక్తే.

ఇన్నాళ్లూ బాలికలు, మహిళలకు విద్యలో, అభిరుచికి తగిన రంగాల్లో సరైన అవకాశాలు అందక.. వారిలోని సామర్థ్యం వృథాగా పోతోంది. వారికి తగిన అవకాశాలిచ్చి ప్రోత్సహిస్తే.. ఆకాశమే హద్దుగా వినూత్నమైన, విభిన్నమైన, అత్యాధునిక ఆలోచనలు, సాంకేతికతలను సృష్టించడం, అభివృద్ధి చేయడం వీలవుతుందనేది నిపుణుల మాట. ఇందుకోసం విద్యా రంగంలో బాలికలకు సమాన అవకాశాలు దక్కేలా చూడాలని.. శాస్త్ర, సాంకేతిక, పరిశోధన రంగాల్లో వారి సామర్థ్యాన్ని వెలికితీసేలా చర్యలు చేపట్టాలని వారు సూచిస్తున్నారు. 

మేరీ క్యూరీకి నివాళిగా..: శాస్త్ర, సాంకేతిక రంగాల్లో మహిళలకు సమాన అవకాశాలు, తగిన ప్రోత్సాహం కోసం ‘మహిళలకు సైన్స్‌ కావాలి.. సైన్స్‌కు మహిళలు కావాలి’ అని ‘ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ, సాంస్కృతిక విభాగం (యునెస్కో)’ నినాదం ఇచ్చింది. ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ జయంతి అయిన ఫిబ్రవరి 11వ తేదీని ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’గా నిర్వహించాలని 2015లో నిర్ణయించింది. సైన్స్‌–టెక్నాలజీ రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఏటా ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. 

‘స్టెమ్‌’ రంగాల్లో ప్రోత్సాహం అవసరం: దశాబ్దాల ఎదురుచూపుల తర్వాత మన పార్లమెంటు ‘మహిళా రిజర్వేషన్ల బిల్లు’ను ఆమోదించింది. అది చట్టరూపమూ దాలి్చంది. ‘నారీ శక్తి’ అంటూ కేంద్ర ప్రభుత్వం రిపబ్లిక్‌ డే రోజున త్రివిధ దళాల్లో మహిళాశక్తిని చాటింది. ఈ ‘నారీ శక్తి’ మరింత విస్తృతమై ‘స్టెమ్‌ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మెడికల్‌)’ రంగాల్లో సత్తా చాటితే.. దేశ అభివృద్ధికి ఎంతో తోడ్పడుతుంది. 

ప్రపంచగతిని మార్చిన మహిళా శాస్త్రవేత్తలు మరెందరో... 
►1910వ దశాబ్దంలోనే కుష్టు రోగానికి చికిత్సను కనుగొన్న అలైస్‌ అగస్టా బాల్‌..  
►సూర్యుడు సహా విశ్వంలోని నక్షత్రాలన్నీ ఎక్కువభాగం హైడ్రోజన్, హీలియంతోనే నిండి ఉన్నాయని తొలిగా ప్రతిపాదించిన బ్రిటీష్–అమెరికన్‌ అంతరిక్ష శాస్త్రవేత్త సెసిలియా పేన్‌ గాపోష్కిన్‌..∙అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ ప్రయోగాల్లో కంప్యూటర్లను వినియోగించడానికి ముందు.. స్పేస్‌ ప్రయోగాల సమయాన్ని, వాటి ప్రయాణతీరును కచ్చితంగా గణించి చెప్పిన ‘హ్యూమన్‌ కంప్యూటర్‌’ కేథరిన్‌ జాన్సన్‌..∙ఇన్సూలిన్, పెన్సిలిన్, విటమిన్‌ బీ12 వంటి బయోరసాయనాల అణు నిర్మాణాన్ని ఎక్స్‌–రే క్రిస్టలోగ్రఫీ సాయంతో గుర్తించే విధానాన్ని అభివృద్ధి చేసిన డొరోతీ హాడ్కిన్‌ (ఇన్సూలిన్‌ వంటి బయో మాలిక్యూల్స్‌ను కృత్రిమంగా తయారు చేయడానికి ఈ విధానం తోడ్పడింది).

మన దేశం నుంచీ ఎందరో.. 
►మొక్కల కణాల్లో శక్తి ఉత్పాదనకు కీలకమైన ‘సైటోక్రోమ్‌ సీ’ అనే ఎంజైమ్‌ను గుర్తించిన మధ్యప్రదేశ్‌ శాస్త్రవేత్త కమలా సొహోనీ  
►కేన్సర్‌ను నిరోధించే ‘వింకా ఆల్కలాయిడ్స్‌’, మలేరియా చికిత్స కోసం వాడే ఔషధాలపై పరిశోధన చేసిన రసాయన శాస్త్రవేత్త అసిమా చటర్జీ (పశ్చిమబెంగాల్‌).. 
►మైక్రోవేవ్‌ పరికరాలపై పరిశోధన చేసి, మన దేశంలో తొలి మైక్రోవేవ్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ నెలకొలి్పన శాస్త్రవేత్త రాజేశ్వరి చటర్జీ (కర్ణాటక).. 

ఇటీవలి కాలాన్ని చూస్తే.. 
►కోవిడ్‌ వైరస్‌ ధాటిని ముందే గుర్తించి హెచ్చరించిన భారత శాస్త్రవేత్త, డబ్ల్యూహెచ్‌ఓ డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్‌.. 
►పుణె వైరాలజీ ల్యాబ్‌లో కోవిడ్‌ వైరస్‌ను ఐసోలేట్‌ చేసి..కోవ్యాక్సిన్‌ రూపకల్పనకు మార్గం వేసిన ల్యాబ్‌ డైరెక్టర్‌ ప్రియా అబ్రహం.. 
►అగ్ని–4,5 క్షిపణుల రూపకల్పన ప్రాజెక్టుకు హెడ్‌గా వ్యవహరించిన శాస్త్రవేత్త టెస్సీ థామస్‌.. ఇలా ఎందరో మహిళా శాస్త్రవేత్తలు ఈ రంగంలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు. 

ఈ తీరు సమాజానికి నష్టం 
మహిళలకు సైన్స్‌లో తగిన అవకాశాలొస్తే అద్భుతాలు సృష్టించగలరు. కానీ సమాజంలో మహిళలను డాక్టర్లు, టీచర్లు వంటి కొన్ని రంగాలవైపే మళ్లిస్తున్నారు. వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను, అభివృద్ధి చెందే అవకాశాలను సమాజం కోల్పోతోంది. బాలికల్లో స్కూల్‌ స్థాయి నుంచే సైన్స్‌ పట్ల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నాం. – మర్లిన్‌ మనాస్, ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ 

తగిన ప్రోత్సాహం కావాలి 
నాకు సైన్స్, మేథమేటిక్స్‌ అంటే చాలా ఇష్టం. ఈ సబ్జెక్టుల్లో అన్ని అంశాలను ఆకళింపు చేసుకుని చదువుతున్నా.. భవిష్యత్తులో పరిశోధనలు చేసి, సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేయాలని ఉంది. తగిన ప్రోత్సాహం అందిస్తే సాధిస్తానన్న నమ్మకముంది. – కేఎన్‌ శ్రీచరణి, ఇంటర్‌ ఫస్టియర్, మొయినాబాద్‌  

‘నోబెల్‌’కే ఘనతనిచ్చిన మేరీ క్యూరీ 
ఆధునిక ఫిజిక్స్‌ రూపునిచ్చిన శాస్త్రవేత్తల్లో మేరీ క్యూరీ ఒకరు. రెండు వేర్వేరు రంగాల్లో నోబెల్‌ పొందిన ఏకైక శాస్త్రవేత్త ఆమె. రేడియో ధార్మిక మూలకాలైన రేడియం, పోలోనియంలను క్యూరీ గుర్తించారు. ఆ రేడియం పేరు మీదుగానే రేడియేషన్‌ పదం పుట్టింది. ఈ పరిశోధనకుగాను 1903లో ‘ఫిజిక్స్‌ నోబెల్‌’ అందుకున్నారు. తర్వాత కెమిస్ట్రీలో పరిశోధనకు 1911లో ‘కెమిస్ట్రీ నోబెల్‌’ పొందారు. తన పరిశోధనల సమయంలో క్యూరీ ఎంతగా రేడియేషన్‌కు గురయ్యారంటే..ఆమె రాసిన నోట్‌ పుస్తకాల నుంచి ఇప్పటికీ రేడియేషన్‌ వెలువడుతోంది.  

అణుశక్తికి మార్గం చూపిన చీన్‌ షుంగ్‌ వు 
చైనాలో పుట్టినా అమెరికాలో స్థిరపడి అణుశక్తికి బాటలు వేసిన శాస్త్రవేత్త చీన్‌ షుంగ్‌ వు.  అణుబాంబుల తయారీ కోసం ‘మాన్‌ హట్టన్‌ ప్రాజెక్టు’లో ఆమె కీలకపాత్ర పోషించారు. రసాయనిక ప్రక్రియల ద్వారా యురేనియం ఉత్పత్తి చేసే విధానాన్ని ఆవిష్కరించారు. 

కంప్యూటర్‌కు ‘భాష’ నేర్పిన గ్రేస్‌ హోపర్‌
తొలి ఎ ల్రక్టానిక్‌–డిజిటల్‌ కంప్యూటర్‌ ‘యూనివాక్‌’ ను రూపొందించిన బృందంలో కీలక పాత్ర పోషించింది అమెరికన్‌ శాస్త్రవేత్త గ్రేస్‌ హోపర్‌. ‘బైనరీ’ భాషలోకి మార్చే తొలి కంపైలర్‌ ప్రోగ్రామ్‌ను రూపొందించినది ఆమెనే.  ‘కోబాల్‌’ ప్రోగ్రామ్‌ రూపకల్పనలోనూ ఈమెది కీలకపాత్రే.

(యునెస్కో గణాంకాల ప్రకారం..) 
►ప్రపంచవ్యాప్తంగా పరిశోధకులలో మహిళల శాతం:33.3%
చూడటానికి ఈ శాతం ఓ మోస్తరుగానే ఉన్నా.. కొన్ని విభాగాల్లోనే మహిళలకు అవకాశాలు అందుతున్నాయి.

మహిళా పరిశోధకులకు సమాన అవకాశాలిస్తున్న దేశాలు: 30
► చాలా దేశాల్లో మహిళా పరిశోధకుల సంఖ్య అతి తక్కువ. కీలక పరిశోధనలు చేసే అవకాశం, నిధుల వంటి అంశాల్లో వివక్షే ఎదురవుతోంది.

‘స్టెమ్‌’ విభాగాల్లోని విద్యార్థుల్లో మహిళలు: 35%
► మెడికల్, కొంతవరకు టెక్నాలజీ రంగంలోనే మహిళలు ఎక్కువ. తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ ఈ రంగాల దిశగా బాలికలను ప్రోత్సహిస్తున్నారు.

ఇప్పటివరకు నోబెల్‌ పొందిన మహిళలు: 22 మంది 
► పరిశోధన రంగంలో మహిళల భాగస్వామ్యం పెరిగినా.. ఉన్నతస్థాయి పోస్టులు, ప రిశోధక బృందాలకు నేతృత్వం వహించే అవకాశాలు తక్కువ. దీనితో మంచి ప్రతిభ ఉన్నా అవార్డులకు, గుర్తింపునకు నోచుకోవడం లేదు.

ఈ తీరు సమాజానికి నష్టం 
మహిళలకు సైన్స్‌లో తగిన అవకాశాలొస్తే అద్భుతాలు సృష్టించగలరు. కానీ సమాజంలో మహిళలను డాక్టర్లు, టీచర్లు వంటి కొన్ని రంగాలవైపే మళ్లిస్తున్నారు. వినూత్న ఆలోచనలను, ఆవిష్కరణలను, అభివృద్ధి చెందే అవకాశాలను సమాజం కోల్పోతోంది. బాలికల్లో స్కూల్‌ స్థాయి నుంచే సైన్స్‌ పట్ల ఆసక్తిని గమనించి ప్రోత్సహిస్తున్నాం.   – మర్లిన్‌ మనాస్, ప్రైవేటు స్కూల్‌ ప్రిన్సిపాల్‌ 

తగిన ప్రోత్సాహం కావాలి 
నాకు సైన్స్, మేథమేటిక్స్‌ అంటే చాలా ఇష్టం. ఈ సబ్జెక్టుల్లో అన్ని అంశాలను ఆకళింపు చేసుకుని చదువుతున్నా.. భవిష్యత్తులో పరిశోధనలు చేసి, సమాజానికి పనికొచ్చే ఆవిష్కరణలు చేయాలని ఉంది. తగిన ప్రోత్సాహం అందిస్తే సాధిస్తానన్న నమ్మకముంది. 
– కేఎన్‌ శ్రీచరణి, ఇంటర్‌ ఫస్టియర్, మొయినాబాద్‌  

నేడు (ఫిబ్రవరి 11న) ‘ఇంటర్నేషనల్‌ డే ఆఫ్‌ విమెన్‌ అండ్‌ గర్ల్స్‌ ఇన్‌ సైన్స్‌’ సందర్భంగా.. 

Advertisement
 
Advertisement