
విదేశాంగ మంత్రిగా అనిత
వాణిజ్య మంత్రిగా సిద్ధూ సహాయ మంత్రులుగా రూబీ సహోటా, సరాయ్
ఒట్టావా: కెనడాలో మార్క్ కార్నీ మంత్రివర్గంలో ఇద్దరు భారత సంతతి నేతలకు కీలక పదవులు దక్కాయి. విదేశాంగ మంత్రిగా అనితా ఆనంద్ (58) , అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రిగా మణీందర్ సిద్ధూ (41) బాధ్యతలు చేపట్టారు. అంతర్జాతీయ వ్యవహారాల సహాయ మంత్రిగా రణ్‌దీప్ సరాయ్ (50), నేర నియంత్రణ శాఖ సహాయ మంత్రిగా రూబీ సహోటా (44) ప్రమాణస్వీకారం చేశారు.
అనిత భగవద్గీతపై ప్రమాణం చేయడం విశేషం. ‘‘ఇది నాకు గర్వకారణం. కెనడియన్లకు సురక్షితమైన, న్యాయమైన ప్రపంచాన్ని అందించడానికి ప్రధాని మార్క్ కార్నీ బృందంతో కలిసి పని చేయనున్నా’’ అని ఎక్స్‌లో పేర్కొన్నారు. అనిత కెనడా లిబరల్ పారీ్టలో సీనియర్ సభ్యురాలు. గతంలో ప్రజా సేవలు, ఇన్నొవేషన్, సైన్స్, పరిశ్రమలు, రక్షణ మంత్రిగా పలు పదవులు నిర్వహించారు. మంత్రివర్గంలో స్థానం దక్కడం తనకు జీవిత కాలపు గౌరవమని సిద్ధూ పేర్కొన్నారు.
ఆమెకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ అభినందనలు తెలిపారు. ఎన్నికల విజయం సాధించిన రెండు వారాల అనంతరం కార్నీ తన మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించారు. మంత్రివర్గం సంఖ్యను 39 నుంచి 28కి కుదించారు. వారిలో సగం మహిళలే కావడం విశేషం! కెనడా–యూఎస్ సంబంధాల ఉద్రిక్తతల మధ్య కెనడియన్లు కోరుకునే, అవసరమైన మార్పును అందించడానికి మంత్రివర్గాన్ని ఎన్నుకున్నట్లు కార్నీ తెలిపారు.
కెనడాలోనే పుట్టి పెరిగిన అనిత
అనిత ఆనంద్ 1967 మే 20న కెనడాలోని కెంట్‌విల్లేలో భారతీయులైన వైద్య దంపతులకు జన్మించారు. ఆమె తండ్రి ఎస్వీ ఆనంద్‌ది తమిళనాడు కాగా తల్లి సరోజ్ డి రామ్ పంజాబీ. వారు 1960ల్లో భారత్ నుంచి కెనడాకు వలస వెళ్లారు. 1985లో ఒంటారియోలో పొలిటికల్ సైన్స్‌లో అకడమిక్ డిగ్రీ, ఆక్స్‌ఫర్డ్ నుంచి న్యాయశాస్త్రంలో ఆనర్స్, డల్హౌసీ వర్సిటీ నుంచి బ్యాచిలర్స్, టొరంటో వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. న్యాయవాద వృత్తిలో, బోధన, ప్రజా సేవలో బలమైన కెరీర్‌ను నిర్మించుకున్నారు. 1995లో న్యాయవాది, వ్యాపారవేత్త జాన్ నోల్టన్‌ను వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు. అనిత 2019లో కెనడా మంత్రివర్గంలో అడుగుపెట్టారు.
ఆ ఘనత సాధించిన తొలి హిందూ మహిళగా చరిత్ర సృష్టించారు. రక్షణ మంత్రిగా ఆమె క్రమశిక్షణ, పనితీరుకు ప్రశంసలు లభించాయి. నిరసనల ఫలితంగా గతేడాది జస్టిన్ ట్రూడో ప్రధాని పదవి నుంచి తప్పుకున్నాక ఆయన వారసునిగా అనిత పేరు ప్రముఖంగా విని్పంచింది. ఇక సిద్ధూవి పంజాబీ మూలాలు. తల్లిదండ్రులతో కలిసి బాల్యంలోనే కెనడా వెళ్లారు. బ్రాంప్టన్ ఈస్ట్ ఎంపీగా ఉన్నారు. పలువురు మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శిగా పని చేశారు. రూబీవీ పంజాబీ మూలాలే. ఆమె టొరంటోలో జని్మంచారు. సరాయ్ తల్లిదండ్రులు కెనడా వలస వెళ్లారు. బ్రిటిష్ కొలంబియాలో జన్మించిన ఆయన నాలుగుసార్లు ఎంపీగా గెలిచారు. ఇటీవలి ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 22 మంది భారత సంతతి నేతలు ఎంపీగా గెలవడం తెలిసిందే.