
న్యూఢిల్లీ: భారత్-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో అనుమానిత పాకిస్తానీ ఉగ్రవాదులు సంచరిస్తున్నారనే సమాచారం అందిన దరిమిలా ఇరు దేశాలు సంయుక్తంగా పెట్రోలింగ్ ఆపరేషన్లు నిర్వహించాయి. పాకిస్తానీ ఉగ్రవాదులను(Pakistani terrorists) గుర్తించేందుకు నేపాలీ దళాలతో కలిసి ఎస్‌ఎస్‌బీ అధికారులు భారత-నేపాల్ అంతర్జాతీయ సరిహద్దుల్లో తనిఖీలు నిర్వహించారని ఇండియా టుడే పేర్కొంది.
మీడియాకు అందిన వివరాల ప్రకారం భారతదేశ సశస్త్ర సీమా బల్ (ఎస్‌ఎస్‌బీ),నేపాల్‌కు చెందిన సాయుధ పోలీసు దళం (ఏపీఎఫ్)లు సరిహద్దుల్లోని దట్టమైన అడవులలో సంయుక్తంగా గాలింపు చేపట్టాయని సమాచారం. భారత్-నేపాల్ 1,700 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటున్నాయి. ఎస్‌ఎస్‌బీ కమాండెంట్ గంగా సింగ్ మీడియాతో మాట్లాడుతూ తాము జరిపిన ఉమ్మడి పెట్రోలింగ్(Joint patrolling)లో నేపాల్ సైనికులు ఉగ్రవాదంపై పోరాటానికి తమతో సహకరించారని అన్నారు. నేపాలీ సైనిక దళాలతో తమకు మంచి సంబంధాలు ఉన్నాయని, ప్రతి నెలా రెండు దేశాల సరిహద్దు దళాల సమన్వయ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. నేపాల్ సైనికాధికారులు తమ నిఘా సమాచారాన్ని భారత్‌తో పంచుకున్నారని, తాము కూడా వారితో సమాచారాన్ని షేర్ చేసుకున్నామన్నారు.
నేపాల్‌గంజ్ ప్రాంతంలో ఒక మర్కాజ్ (ఇస్లామిక్ సంస్థ) ఉందని, అక్కడనిర్వహించే కార్యక్రమాలకు పాకిస్తానీలు తరచూ వచ్చేవారని సింగ్ తెలిపారు. ఎస్‌ఎస్‌బీ దళాలు నేపాల్ సరిహద్దుల్లో వాచ్ టవర్ల నుండి నిఘా సారించాయని చెప్పారు. కాగా భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో నేపాల్ ప్రభుత్వం భారత్‌కు సంఘీభావం ప్రకటించింది. నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ‘ఉగ్రవాదంపై పోరాటంలో నేపాల్ అందరితో కలిసి పనిచేస్తుందని’ పేర్కొన్నారు. పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పౌరులు మృతిచెందగా, వారిలో ఒక నేపాలీ జాతీయుడు కూడా ఉన్నారు.
ఇది కూడా చదవండి: ఉగ్రవాదానికి 20 వేలమంది భారతీయులు బలి: ఐక్యరాజ్యసమితిలో భారత్