
న్యూఢిల్లీ: గడచిన నాలుగు దశాబ్ధాలలో చోటుచేసుకున్న ఉగ్రవాద దాడులకు 20 వేల మందికిపైగా భారతీయులు ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి(United Nations)లో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. గత నెలలో పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన దరిమిలా పాకిస్తాన్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నదని ఐక్యరాజ్య సమితిలో భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
న్యూయార్క్‌లోగల ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన సభలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ మాట్లాడుతూ పాకిస్తాన్(Pakistan) ఉగ్రవాదానికి కేంద్రంగా ఉన్నదని, అది సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించే వరకూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తామని హెచ్చరించారు. పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితిలో ఈ ఒప్పంద అంశాన్ని లేవనెత్తిన తర్వాత భారత్ ఘాటుగా స్పందించింది.
#IndiaAtUN
PR @AmbHarishP delivered India’s statement at the Arria Formula Meeting on Protecting Water in Armed Conflict – Protecting Civilian Lives. @MEAIndia @UN pic.twitter.com/SV0wzzW5XS— India at UN, NY (@IndiaUNNewYork) May 23, 2025
65 ఏళ్ల క్రితం భారత్ సింధు జలాల ఒప్పందంపై చిత్తశుద్ధితో సంతకం చేసిందని, అయితే పాకిస్తాన్ భారత్‌పై మూడు యుద్ధాలు జరిపి, లెక్కకుమించిన ఉగ్రవాద దాడులను చేయడం ద్వారా ఆ ఒప్పందపు స్ఫూర్తిని ఉల్లంఘించిందని హరీష్ పేర్కొన్నారు. గత నాలుగు దశాబ్దాలలో 20 వేల మందికి పైగా భారతీయులు ఉగ్రవాద దాడుల్లో మరణించాని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశం ఎల్లప్పుడూ పాకిస్తాన్ విషయంలో అసాధారణ సహనం, ఉదారతను ప్రదర్శించిందని హరీష్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: తోటి సైనికుని కాపాడబోయి.. ఆర్మీ అధికారి దుర్మరణం