
టెక్స్టింగ్, టైపింగులదే రాజ్యం
అలంకారప్రాయంగా మిగిలిన పెన్ను
ప్రస్తుతం అంతా డిజిటల్ యుగం. చేతిరాత దాదాపుగా చచ్చిపోతోంది. డిజిటల్ అవకాశాలు చేతిరాత అవసరాన్నే దాదాపుగా తగ్గించేశాయి. రాత అవసరమైన కెరీర్‌ను పక్కకు పెట్టే అవకాశం వచ్చింది. ఒకప్పుడు చొక్కా జేబులకు హుందాగా వేలాడిన పెన్ను ఇప్పుడు అలంకారప్రాయంగా కూడా మిగలని పరిస్థితి! కాలేజీ విద్యార్థులు టైపింగ్, టెక్స్టింగ్ చేయడం లేదా వాయిస్ నోట్స్ పంపడం చేస్తున్నారు.
స్క్రీన్లపై, వ్యాకరణ స్లిప్‌లు, అక్షర దోషాలు కూడా ఆటోకరెక్ట్ అవుతున్నాయి. ఇలాంటి డిజిటల్ యుగంలో ఇంకా విద్యార్థులకు ‘చేతిరాత’శిక్షలు అవసరమా? ఇది ఇప్పుడు పాఠశాలలు ఆలోచించాలంటున్నారు నిపుణులు. ‘పేలవమైన చేతివ్రాతను శిక్షించడం మానేయాలి. విద్యార్థి పనిని ప్రదర్శన కోసం కాకుండా కంటెంట్ కోసం అంచనా వేయాలి. ప్రత్యామ్నాయ మూల్యాంకన పద్ధతులను అన్వేషించాలి.
తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఇద్దరూ పిల్లలకు వ్యక్తిగత రచన కోసం ప్రైవేట్ స్థలాన్ని ఇవ్వాలి. యువతకు రాయడానికి, విఫలమవడానికి, నేర్చుకోవడానికి అవకాశం ఇవ్వండి. వారిని శిక్షించే పద్ధతులను మార్చండి’అని సూచిస్తున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఎత్తుగడలు చేతిరాత భయం యొక్క మూల కారణాలను తొలగిస్తాయి. రాయడం ముఖ్యమైన జీవిత నైపుణ్యమే. అలాంటి చోట పెన్ను ఒక సాధనంగా ఉండాలే తప్ప.. బెదిరింపు ఆయుధంగా మారకూడదని హెచ్చరిస్తున్నారు.
గ్రాఫో ఫోబియా
‘ముత్యాల్లాంటి అక్షరాలు.. రాత చూస్తేనే మార్కులు పడిపోతాయి’అందమైన చేతిరాత ఉన్న విద్యార్థులకు ఉపాధ్యాయులిచ్చే కితాబు. ‘ఏంట్రా ఈ కొంగలు తొక్కిన రాత.. ఇట్లా రాస్తే ఏం అర్థమవుతుంది?’... ఇవి రాత బాగలేని వారికి పడే చివాట్లు. ఇప్పటికీ మన దేశంలోని తరగతి గదుల్లో టీచర్స్ నోట వినబడే ముచ్చట్లు. అవును చేతిరాతలు ఒకప్పుడు తలరాతలను మార్చాయి. కొందరికి మాత్రం ఫోబియాను మిగిల్చాయి.
ప్రస్తుత డిజిటల్ యుగంలో.. చేతిరాత కళపై చర్చ జరుగుతోంది. చేతిరాత అనగానే గుర్తొచ్చేది కాపీరైటింగ్ నోట్స్. తెలుగుకోసం డబల్ రూల్.. ఇంగ్లిష్ కోసం ఫోర్ రూల్ బుక్స్. రాత బాగుపడటం కోసం పదేపదే రాయించే టీచర్స్. రాత బాగోకపోతే టీచర్లతో పడే తిట్లు. బాగున్నందుకు అందే మెచ్చుకోళ్లు. పాఠశాలలో ఉండగా డైరీ ఎంట్రీలు.. యవ్వనంలో ప్రేమ లేఖలు.
అవి కొందరిని సృజనాత్మక రచనలోకి మారేలా చేస్తే.. రాత సరిగ్గా లేని కొందరినీ భయంలోకి నెట్టేశాయి. అందుకే.. చిన్న దరఖాస్తు.. అందులో రాయాల్సిందల్లా పేరు, చిరునామా, తేదీ మాత్రమే. అయినా సరే.. పెన్ను, పేపర్ తాకగానే ఓ బెరుకు.. అక్షరం ముందుకు కదలదు. అబ్బా ఆన్‌లైన్ ఫామ్ పెట్టొచ్చు కదా.. ఎంత వయసొచ్చినా సరే.. ఇప్పటికీ కొంతమందికి ఉండే ఫోబియా ఇది.
చేతిరాత సరిగా లేక.. బాల్యంలో టీచర్ చేత తిన్న తిట్లు గుర్తుకు వచ్చి కలిగే భయం. దీనిని గ్రాఫోఫోబియా (చేతివ్రాత భయం), స్క్రిప్టోఫోబియా (బహిరంగంగా రాయడానికి భయం) అని పిలుస్తారు. బాల్యంలో చేతిరాత సరిగా లేకపోవడం వల్ల ఎంతో మందికి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు.. ఆ తరువాత ఉన్నత విద్యను, ఆపైన కెరీర్‌ను కూడా ప్రభావితం చేశాయంటే అతిశయోక్తి కాదు.
శిక్షగా రాత!
భారత విద్యా వ్యవస్థలో నేటికీ చేతిరాతే ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇటీవల ముంబైలోని ఒక ట్యూషన్ టీచర్ చేతి రాత సరిగా లేదని ఎనిమిదేళ్ల బాలుడి చేతిని కొవ్వొత్తితో కాల్చిన విషయం తెలిసిందే. క్లాస్‌రూమ్‌లో చేసిన తప్పులకు శిక్షగా కూడా ఈ చేతిరాతనే ప్రయోగిస్తుంటారు ఉపాధ్యాయులు. క్లాసు జరుగుతుండగా మాట్లాడిన విద్యారి్థతో ‘నేను మళ్ళీ తరగతిలో మాట్లాడను’అని 200 సార్లు రాయమని సూచించడం అందుకో ఉదాహరణ. చేతిరాతలో జెండర్ పాత్ర కూడా ఉంది. అమ్మాయివై ఉండి ఇట్లా రాస్తే ఎట్లా.. అని టీచర్లతో తిట్లుతిన్న అమ్మాయిలనేకం.
ఆ ఒత్తిడి కొందరికి కాలిగ్రఫీ, స్టెనోగ్రఫీ లాంటివాటిపై ప్రేమను పెంచితే.. పదేపదే విమర్శలు మరికొందరికి అవమాన భారాన్ని మిగిల్చాయి. ఈ శిక్షలు రాయడాన్ని శిక్ష, అవమానంగా అలవాటు చేశాయి. పేలవమైన చేతిరాత భయంతో రాయడం మానేశామని 36.3% మంది విద్యార్థులు 2012 జరిగిన ఓ అధ్యయనంలో చెప్పారంటే.. తీవ్రత ఏపాటిదో అర్థమవుతుంది. ఇప్పుడంటే వాట్సప్, మెసెంజర్, ఈమెయిల్.. వీటన్నింటికీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో పాస్‌వర్డ్‌తో సంరక్షణ ఉంది కాబట్టి ఎవరో చూస్తారనే భయం లేదు.
కానీ.. యువతకు గోప్యత అంటూ లేని కాలంలో.. తమ డైరీనో లేఖనో దొరికితే.. కలిగే అవమానం, శిక్ష.. చేతిరాతను జీవితాంతం ట్రామాగా మిగిల్చిన సందర్భాలూ ఉన్నాయి. ఇవన్నీ.. మెదడులోని హిప్పోకాంపస్, లింబిక్ వ్యవస్థలను ప్రభావితం చేస్తాయి. ఇది శ్రద్ధ, జ్ఞాపకశక్తి, భావోద్వేగాల నియంత్రణను దెబ్బతీస్తుంది. అందుకే రాయడానికి పెన్ను పట్టుకోగానే వారికి చేతిలో వణుకు, అరచేతులకు చెమటలు రావడం, గుండె వేగంగా కొట్టుకోవడం, వికారం, తిమ్మిర్లు రావడం, మణికట్టు నొప్పి వస్తాయి. ఇవన్నీ ఒకప్పుడు వారు ఎదుర్కొన్న అవమానాల తాలూకు మానసిక సంకేతాలు.
– సాక్షి, నేషనల్ డెస్క్