
వైరల్‌గా మారిన మమ్దానీ భోజనం వీడియో
చేత్తో తినడం అనాగరికమంటూ తిట్టిపోసిన అమెరికా నేతలు
న్యూయార్క్: న్యూయార్క్ సిటీ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థిత్వాన్ని గెల్చుకున్న జోహ్రామ్ ఖ్వామీ మమ్దానీ ఏం చేసినా ఇప్పుడు విమర్శల వర్షం కురుస్తోంది. ఇప్పుడు తాపీగా కూర్చుని పప్పన్నం తిన్నా సరే అమెరికా రాజకీయనేతలు తీవ్రంగా తప్పుబట్టడం ఇప్పుడు కొత్త వార్తాంశంగా నిలిచింది. ఒక ఇంటర్వ్యూ సందర్భంగా మమ్దానీ భోజనం చేస్తూ కనిపించారు. ఒక చిన్న ప్లేట్‌లో అన్నం, పప్పు చేత్తో కలుపుకుని కడుపారా తిన్నారు.
‘‘ ప్రపంచాన్ని చూసే దృక్కోణాన్ని నేను అభివృద్ధి చెందుతున్న(థర్డ్ వరల్డ్) దేశాల నుంచే నేర్చుకున్నా’’ అని అన్నారు. అయితే ఈ వీడియోను ‘ఎడ్ ఓక్‌నెస్’ అనే ‘ఎక్స్’ ఖాతాలో ఒకతను పోస్ట్‌చేసి మమ్దానీ తీరును తప్పుబట్టారు. ‘‘ అన్నాన్ని చేత్తో తింటూ ఆయన తనకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అని చెబుతున్నారు’’ అని ఆ నెటిజన్ వ్యాఖ్యానించారు. దీనికిఅమెరికా దిగువసభ సభ్యుడు, రిపబ్లికన్ పార్టీ యువనేత బ్రాండన్ జీనీ గిల్ సైతం మద్దతు పలికి మమ్దానీని తప్పుబట్టారు.
Civilized people in America don’t eat like this.
If you refuse to adopt Western customs, go back to the Third World. https://t.co/TYQkcr0nFE— Congressman Brandon Gill (@RepBrandonGill) June 30, 2025
‘‘ అమెరికాలో ఉంటూ అనాగరికంగా తింటున్నారు. మీకు థర్డ్ వరల్డ్ స్ఫూర్తి అయితే ఆ థర్డ్ వరల్డ్‌లోనే బతకండి. అక్కడికి వెళ్లిపొండి’’ అని ఒక క్యాప్షన్ పెట్టారు. ‘‘ రాజకీయ జిమ్మిక్కులో భాగంగానే ఆయన ఇలా చేత్తో తింటున్నారు. సాధారణంగా ఆయన చేత్తో కాకుండా చెంచాలు, ఫోర్క్‌లతో తింటారు’’ అని కొందరు నెటిజన్లు విమర్శించారు. మ్యాన్‌హాట్టన్ జిల్లా అటార్నీ రేసులో ఉన్న రిపబ్లికన్ నాయకురాలు మాడ్ మరూన్ సైతం విమర్శించారు. అయితే మరికొందరు మాత్రం మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ఆయన చక్కగా చేత్తో కలుపుకుని తిన్నారు.
తినడం అనేది ఆయా వ్యక్తుల సంస్కృతి, ఆచార వ్యవహారాలు, అలవాట్లకు సంబంధించిన అంశం. ఇది పూర్తిగా జాత్యహంకారమే’’ అని వ్యాఖ్యానించారు. ‘‘ రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే సత్తాలేక ఆయన వ్యక్తిగత అలవాట్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు. చేత్తో తినని వాళ్లకే అమెరికా చెందుతుందని రాజ్యాంగంలో రాశారా?. చేత్తో తింటే అనాగరికం ఎలా అవుతుంది?’’ అని మరికొందరు మమ్దానీకి మద్దతు పలికారు. ‘‘ టాకూస్, ఫ్రెంచ్ ప్రై, బర్గర్, పిజ్జా, లేస్ ప్యాకెట్ ఎలా తింటారు?. చేత్తోనేకదా తినేది. మరి అలాంటప్పుడు పప్పన్నం హాయిగా చేత్తో కలిపి తింటే తప్పేంటట?’’ అని మరికొందరు వాదించారు. ‘‘ అమెరికాలో అన్నం చేత్తో తినడం కూడా తప్పేనా?. అమెరికా ఎటు పోతోంది?’’ అని ఇంకొకరు వ్యాఖ్యానించారు.