నోబెల్‌ బహుమతి కావాలంటే ట్రంప్‌ ఆ పని చేయాలి: మెక్రాన్‌ | Nobel Prize Row: Macron Counters Trump, Demands Gaza War End | Sakshi
Sakshi News home page

నోబెల్‌ బహుమతి కావాలంటే ట్రంప్‌ ఆ పని చేయాలి: మెక్రాన్‌

Sep 24 2025 9:32 AM | Updated on Sep 24 2025 11:01 AM

France Macron Interesting Comments On Trump Nobel Prize Ambition

న్యూయార్క్‌: ప్రపంచ యుద్ధాలను ఆపాను.. తనకు నోబోల్‌ బహుమతి ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) వ్యాఖ్యలు చేస్తున్నా వేళ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌(Emmanuel Macron) కౌంటరిచ్చారు. ట్రంప్ నిజంగా నోబెల్(Nobel) శాంతి బహుమతిని గెలుచుకోవాలనుకుంటే గాజాలో యుద్ధాన్ని ఆపాలని మెక్రాన్‌ సూచించారు. గాజాలో యుద్ధానికి తాము ఆయుధాలు పంపించడం లేదని.. అమెరికానే ఆ సాయం చేస్తోందని విమర్శలు చేశారు.

ఐరాస సమావేశంలో నిమిత్తం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్‌ అమెరికాకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ట్రంప్‌ నోబెల్‌ బహుమతి అంశం గురించి మెక్రాన్‌ ప్రస్తావించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గాజాలో మారణహోమాన్ని ట్రంప్‌ ఆపి తీరాలి. గాజాపై యుద్ధాన్ని ముగించడానికి ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చే శక్తి ట్రంప్‌కు మాత్రమే ఉంది. ట్రంప్‌ మనకంటే ఎక్కువ చేయగలడు. ఎందుకంటే గాజాలో యుద్ధం చేయడానికి అనుమతించే ఆయుధాలను మేము సరఫరా చేయడం లేదు. గాజాలో యుద్ధం చేయడానికి అనుమతించే పరికరాలను అమెరికా సరఫరా చేస్తుంది. ట్రంప్‌కు నోబెల్‌ ఇవ్వాలని పదేపదే చెబుతున్నారు. ఆయనకు నిజంగా నోబెల్‌ కావాలంటే గాజాలో యుద్దాన్ని ఆపాలి. ఈ సంఘర్షణను ఆపితేనే నోబెల్ శాంతి బహుమతి సాధ్యమవుతుంది. వెంటనే శాంతి చర్చలు జరపాలి అని చెప్పుకొచ్చారు.

ఇది కూడా చదవండి: ఐరాసలో ట్రంప్‌కు చేదు అనుభవం..

ఇదిలా ఉండగా.. అంతకుముందు మెక్రాన్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఐరాస సర్వప్రతినిధి సభలో పాల్గొనడానికి వచ్చిన ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమాన్యుయేల్‌ మెక్రాన్‌ను అమెరికాలో ఓ ట్రాఫిక్‌ పోలీసు అధికారి ఆపేశాడు. ఐరాసలో ప్రసంగించడానికి ట్రంప్‌ వస్తున్న వేళ..‘‘క్షమించండి ప్రెసిడెంట్, ప్రతిదీ స్తంభించిపోయింది. ఇప్పుడొక వాహన శ్రేణి వస్తోంది. ప్లీజ్‌ అర్థం చేసుకోండి’ అంటూ ఆ అధికారి అధ్యక్షుని పేరు చెప్పకుండా మెక్రాన్‌ను ముందుకు వెళ్లకుండా ఆపేశాడు. తాను ఫ్రాన్స్‌ దౌత్య కార్యాలయానికి వెళ్లాల్సి ఉందంటూ ఫ్రెంచి అధ్యక్షుడు చెప్పినా ఫలితం లేకపోయింది. విషయం అర్థం చేసుకున్న మెక్రాన్‌ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకే నేరుగా ఫోన్‌ కలిపారు. ‘‘మీ కోసం ఇక్కడ ప్రతిదీ స్తంభించిపోయింది తెలుసా’’ అంటూ మెక్రాన్‌ బిగ్గరగా నవ్వుతూ మాట్లాడుతున్న వీడియో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. ఈ టెలిఫోన్‌ సంభాషణ సందర్భంగా ఇరువురు నేతలూ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారని ఫ్రాన్స్‌ అధికార వర్గాలు తెలిపాయి.

అయితే, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం అమెరికాలోని న్యూయార్క్‌ నగరంలో ఉంది. ఐరాస నిర్వహణ కోసం అత్యధికంగా నిధులు కేటాయించే దేశం కూడా అమెరికాయే. అందుకే ఐరాసలో అమెరికా అధ్యక్షునికి ప్రత్యేక గౌరవం. ఆయన ఐరాస సందర్శించడానికి వచ్చినప్పుడు వాహనాల్ని ఎక్కడికక్కడ స్తంభింపజేస్తారు. ఈ ప్రక్రియను ఫ్రీజ్‌ అని పిలుస్తారు. ఈ ఫ్రీజ్‌లో ఇరుక్కుంటే ఎంతవారైనా ఒక్క అడుగు ముందుకేయడానికి వీలుండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement