
595 డ్రోన్లు, 48 క్షిపణులతో విధ్వంసం
నలుగురు మృతి, 42 మందికి గాయాలు
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ లక్ష్యంగా రష్యా మరోసారి పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లను ప్రయోగించింది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు కొనసాగిన దాడుల్లో భారీ నష్టం వాటిల్లింది. కీవ్‌తోపాటు జపొరిఝియా ప్రాంతాల్లో జరిగిన విధ్వంసంతో 12 ఏళ్ల బాలిక సహా నలుగురు చనిపోగా, 42 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఈ దాడిని పౌరులపై జరుగుతున్న యుద్ధంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభివరి్ణంచారు.
రష్యా గత నెలలో కీవ్‌పై చేపట్టిన భారీ దాడిలో కనీసం 21 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత జరిగిన మొదటి భారీ దాడి ఇది. తాజా దాడిలో రష్యా 595 డ్రోన్లు, 48 బాలిíస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. వీటిలో చాలా వరకు డ్రోన్లను, 43 క్షిపణులను మధ్యలోనే అడ్డుకున్నామంది. రాజధానిలోని సిటీ సెంటర్ సమీపంలో సంభవించిన భారీ పేలుడుతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్నంతా కమ్మేశాయి. పలు నివాస భవనాలు, మౌలిక వసతులు, మెడికల్ ఫెసిలిటీ, కిండర్‌గార్టన్ దెబ్బతిన్నాయి. డ్రోన్ల దాడిలో బహుళ అంతస్తుల నివాస భవనం ఒకటి తీవ్రంగా దెబ్బతింది.
పై అంతస్తుల్లో మంటలు చెలరేగగా, కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపించాయి. ఫైర్ ఫైటర్లు, అత్యవసర సేవల సిబ్బంది ఎలక్ట్రిక్ రంపాలతో శిథిలాలను తొలగించారు. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకోవడంతో, జనం భయకంపితులయ్యారు. రాజధాని వ్యాప్తంగా 20కుపైగా ప్రాంతాల్లో నష్టం వాటిల్లింది.
సైరన్ల మోతలతో జనం కీవ్‌లోని సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోకి పరుగున చేరుకున్నారు. హెచ్చరికలు నిలిచాక బయటకు వచ్చారు. ఇలా ఉండగా, ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో ఆదివారం వేకువజామున పొరుగునున్న పోలండ్ తన సైన్యాన్ని అప్రమత్తం చేసి, యుద్ధ విమానాలను సరిహద్దుల్లో మోహరించి ఉంచింది.
ముందు జాగ్రత్తగా ఈ మేరకు రక్షణ చర్యలు చేపట్టామని పోలండ్ మిలటరీ పేర్కొంది. కీవ్‌పై చేపట్టిన దాడుల గురించి రష్యా రక్షణ శాఖ స్పందించలేదు. కానీ, శనివారం రాత్రి నుంచి ఉక్రెయిన్ ఆర్మీ ప్రయోగించిన 41 డ్రోన్లను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయని రష్యా తెలిపింది. అమెరికాతో భారీ ఆయుధ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ శనివారం ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడులు జరపడం గమనార్హం. ఈ ప్యాకేజీలో అమెరికా నుంచి ఉక్రెయిన్ 90 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలను కొనుగోలు చేయడం, ఉక్రెయిన్ తయారీ క్షిపణులను అమెరికా నేరుగా కొనుగోలు చేయడం ఉన్నాయి.