పాకిస్థాన్ కరాచీ ఓడరేవులో భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. పోర్టులో పెద్దఎత్తున మంటలు చెలరేగి అక్కడే ఉన్న కంటైనర్లకు వ్యాపించాయి. దీంతో పెద్దఎత్తున అగ్నికీలలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేసారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదని తెలుస్తోంది.
కరాచీ అంతర్జాతీయ నౌకాశ్రయంలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీలను తీసుకెళ్తున్న కంటైనర్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అనంతరం ఇవి వెనువెంటనే వేరే కంటైనర్లకు వ్యాపించడంతో 20 వరకూ కంటైనర్లు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాద వివరాలు తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశాయి.
అయితే మంటలు వ్యాపించిన సమయం మధ్యాహ్నం ఒంటిగంటతో పాటు నిన్న శుక్రవారం కావడంతో కార్మికులంతా నమాజ్ కోసం దగ్గర్లో ఉన్న మసీద్‌కు వెళ్లారని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో పెను ప్రమాదం తప్పిందని పేర్కొన్నారు. మంటలను అదుపు చేయడంలో 20కి పైగా అగ్నిమాపక యంత్రాలు పాల్గొన్నాయన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించకపోయినా పెద్ద మెుత్తంలో ఆస్తి నష్టం జరిగే అవకాశముందని అధికారులు తెలిపారు.


