ఇంగ్లాండ్ రాజధాని లండన్‌లో జరిగిన అనూహ్య ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్కడ రోడ్డుపై నడిచివెళుతున్న మహిళకు ప్రక్కనే పావురాల గుంపు కనిపించింది. వాటికి ఏదైనా తినిపించాలని అనిపించడంతో ఆహారం వేసింది. దీంతో వెంటనే అక్కడికి వచ్చిన పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆశ్చర్యపోవడం ఆమె వంతయ్యింది.
ఇంగ్లాండ్.. లండన్‌లో పరిసరాల పరిశుభ్రతకు అక్కడి అధికారులు కఠిన చట్టాలు అవలంభిస్తున్నారు. పాపం అది తెలియని ఓ మహిళ పక్షులకు ఆహారం తినిపించి ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే... బుధవారం లండన్‌లో ఓ మహిళ పావురాలకు ఆహారం వేసింది. అయితే అక్కడి చట్టాల ప్రకారం రోడ్డుపై ఏదైనా పదార్థాలు వేయడం నేరం. దీంతో ఇది గమనించిన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆమె వేడుకోవడంతో 100 పౌండ్లు జరిమానా విధించి వదిలేశారు.
ఈ చిత్రాలను అక్కడే ఉన్న ఓ వ్యక్తి తన ఫోన్‌లో చిత్రీకరించారు. దీంతో ఇవి వైరల్‌గా మారాయి. అయితే లండన్‌లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త చెదారం వేయడం నేరం. అంతేకాకుండా పెద్ద సౌండ్లతో సౌండ్‌బాక్సుల వాడకం అనుమతి లేకుండా కరపత్రాలు పంచడం తదితరమైన పనులన్నీ అక్కడ నేరంగా పరిగణిస్తారు. వీటికి జైలుశిక్షతో పాటు జరిమానాలు విధిస్తారు.


