
బోరిస్ తుఫానుతో పలు దేశాలు అతలాకుతలం
కుండపోత వర్షాలు మధ్య, తూర్పు యూరప్‌లో బీభత్సం సృష్టిస్తున్నాయి. బోరిస్ తుఫాను ధాటికి విపరీతమైన వర్షపాతం నమోదవుతోంది. రొమేనియా, ఆ్రస్టియా, జర్మనీ, స్లొవేకియా, హంగేరీ సహా పలు మధ్య యూరోపియన్ దేశాల్లో భారీ వర్షాలు కురిశాయి. చెక్ రిపబ్లిక్ కూడా ఎడతెరిపి లేని వానలతో అతలాకుతలమవుతోంది. భారీ సంఖ్యలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.
దేశవ్యాప్తంగా 90 చోట్ల వరద హెచ్చరికలను ప్రకటించారు. ఓపావా సహా పలు నగరాల్లో వేలాది మందిని ఇళ్లను వదిలి ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వం కోరింది. రాజధాని ప్రేగ్‌నూ వరద విలయం సృష్టిస్తోంది. దక్షిణ బొహెమియా ప్రాంతంలో వరదల దెబ్బకు ఓ డ్యామ్ బద్దలైంది. 1997 నాటి ‘శతాబ్దపు వరద’ల కంటే పరిస్థితి దారుణంగా ఉందని చెక్ ప్రధాని పీటర్ ఫియాలా వాపోయారు.
నైరుతి పోలెండ్లోని ఒపోల్ ప్రాంతంలో నది ఉప్పొంగడంతో పట్టణం వరద ముంపుకు గురైంది. దేశంలో రెండో అతి పెద్ద నగరం క్రాకోవ్ కూడా వరదలో చిక్కుకుంది. కరెంటు లేక, టెలిఫోన్ నెట్‌వర్క్ పని చేయక జనం నరకం చూస్తున్నారు. ఆస్ట్రియాలో వియన్నా పరిసరాలను విపత్తు ప్రాంతంగా ప్రకటించారు. భారీ వర్షాలు మంగళవారం దాకా కొనసాగుతాయన్న అంచనాలు మరింత భయపెడుతున్నాయి.
– ప్రేగ్