టార్గెట్‌ చైనా ఎందుకంటే..!  | Donald Trump wants to bring back American manufacturing sector | Sakshi
Sakshi News home page

టార్గెట్‌ చైనా ఎందుకంటే..! 

Apr 11 2025 4:53 AM | Updated on Apr 11 2025 4:53 AM

Donald Trump wants to bring back American manufacturing sector

‘ప్రపంచ ఫ్యాక్టరీ’ ముద్రను చైనా నుంచి తొలగించాలని చూస్తున్న ట్రంప్‌

అమెరికాకు ఫ్యాక్టరీలు బాటపట్టాలని అమెరికా అధ్యక్షుడు వ్యూహరచన 

టారిఫ్‌ల మోత అందుకేనని నిపుణుల విశ్లేషణ 

కాళ్లబేరానికి వచ్చిన కారణంగా డజన్ల కొద్దీ ప్రపంచదేశాలపై ఆంక్షల కత్తిని దింపకుండా 90 రోజులు ఆగుతానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బుధవారం ప్రకటించారు. వాస్తవానికి బుధవారం నుంచే అన్ని దేశాలపై పెరిగిన టారిఫ్‌లు అమల్లోకి రావాల్సి ఉండగా ఆఖరి నిమిషంలో ట్రంప్‌ తన నిర్ణయాన్ని అనూహ్యంగా వాయిదా వేశారు. 

అయితే ఇందులో అనూహ్యమేమీ లేదని, ట్రంప్‌ అసలు లక్ష్యం ఈ దేశాలు కాదని, చైనాయే అసలు లక్ష్యమని కొందరు అంతర్జాతీయ వాణిజ్యరంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాళ్లు చెప్పినట్లు నిజంగానే ట్రంప్‌ కేవలం చైనా ఉత్పత్తులు, ఎగుమతి మార్కెట్‌పై కత్తిగట్టారా? అనే చర్చ ఇప్పుడు వాణిజ్యవర్గాల్లో మొదలైంది. దీనికి కొన్నేళ్ల క్రితమే బీజాలు పడ్డాయని తెలుస్తోంది.  

తొలి దఫా పగ్గాలు చేపట్టినప్పుడే
దాదాపు 13 ఏళ్ల క్రితంనాటి సంగతి. చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో హఠాత్తుగా అంతర్జాతీయ వాణిజ్య సంబంధాల బలోపేతంపై విస్తృతస్థాయి సమావేశాలు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వస్తూత్పత్తుల వినిమయ అవకాశం ఉన్న దేశాలతో చైనా వాణిజ్య సంబంధాలను బలపర్చుకుంది. అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, కంపెనీలు, దేశాల ప్రభుత్వాలతో చైనా కమ్యూనిస్ట్‌ ప్రభుత్వం చర్చలు జరిపింది. 

చవగ్గా సరుకుల సరఫరాపై ఒప్పందాలు కుదిరాయి. విదేశీ సంస్థల ప్రతినిధులు, చైనా ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల ఉన్నతాధికారులు, ప్రముఖ ఆర్థికవేత్తల మధ్య సఖ్యత కుదిరింది. దీంతో చైనా నుంచి అన్ని రకాల ఉత్పత్తుల ఎగుమతి అనూహ్యంగా ఊపందుకుంది. చైనాకు నిరాయుధ సైన్యంగా పేరొందిన కార్మికుల కష్టంతో పురుడుపోసుకున్న లక్షల కోట్ల రూపాయల వస్తువులు ప్రపంచదేశాలకు ఎగుమతి అయ్యాయి. 

ఆ పరంపర అప్రతిహతంగా కొనసాగి అమెరికాను తోసిరాజని చైనా ప్రపంచ ఎగుమతి కేంద్రంగా మారింది. మారిన ఈ పరిణామాలను ట్రంప్‌ అస్సలు జీర్ణించుకోలేకపోయారు. తక్కువ ధరకే వస్తువులు లభిస్తుండటంతో ప్రపంచదేశాల కీలక వ్యాపారసంస్థలన్నీ చైనాకే క్యూకట్టాయి. అక్కడ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయి. రోల్స్‌ రాయిస్, జనరల్‌ మోటార్స్, ఫోక్స్‌వ్యాగన్‌ సంస్థల ఉత్పత్తులూ చైనాలో తయారవడం మొదలైంది. 

దీంతో దశాబ్దాల చరిత్ర కల్గిన అమెరికాలోని కొన్ని కంపెనీల నుంచి ఉత్పత్తి తగ్గింది. దీంతో అమెరికా పరిశ్రమల్లో కార్మికుల జీవితాల్లో వెలుగులు తగ్గిపోయాయి. అమెరికాకు పరిశ్రమల నుంచి రెవెన్యూ పడిపోయింది. అమెరికా పారిశ్రామికరంగానికి పూర్వవైభవం తెస్తానని తొలిసారి ఎన్నికల్లో పోటీచేసినప్పుడే ట్రంప్‌ ఓటర్లకు మాటిచ్చారు. గెలిచి అధికారం చేపట్టారు. కానీ ఆ నాలుగేళ్లలో అనుకున్న వ్యూహాలను అమలుచేయలేకపోయారు. దీనికి ఇతరత్రా కారణాలున్నాయి. ఇప్పుడు రెండోదఫా అధికారంలోకి రాగానే పాత ప్రణాళికలకు పదునుపెట్టి ప్రయోగిస్తున్నారు. దాని ఫలితమే ఈ టారిఫ్‌ల పరంపర. ఎగుమతులు పెరిగాక 

చైనాలో ఏం జరిగింది? 
ఎగుమతులతో చైనా ఆర్థికాభివృద్ది సాధించాక అక్కడ పౌరులు పాలనలో సంస్కరణలు కోరుకున్నారు. కానీ ఏక పార్టీ, నియంతృత్వపాలనలో ఆ కల నెరవేరలేదు. కొనుగోలు శక్తి పెరిగాక వినిమయ సమాజంగా అభివృద్ధి చెందాలని జనం భావించినా అదీ నెరవేరలేదు. ప్రభుత్వం కేవలం ఎగుమతులపైనా దృష్టిసారించింది. 2015లో బహిర్గతమైన ‘‘మేడిన్‌ చైనా 2025’ బ్లూప్రింట్‌ సైతం ఇదే విషయాన్ని ఉద్ఘాటించింది. గుండుసూది నుంచి గగనతల రక్షణ వ్యవస్థలదాకా, విద్యుత్‌వాహనాలు మొదలు అధునాతన యుద్ధవిహంగాల దాకా ప్రతిరంగంలో అగ్రగామిగా వెలుగొందడమే లక్ష్యంగా ముందుకుసాగి ఆ పనిలో సఫలీకృతమైంది. 

ఇదే సమయంలో అమెరికాలో ట్రంప్‌ రాజకీయ రంగప్రవేశంచేసి చైనా ఎగుమతి మార్కెట్‌ ఎదుగుదలకు అడ్డుకట్టవేయాలని కంకణం కట్టుకున్నారు. ఎన్నికల హామీల్లోనే అదే చెప్పారు. చైనా ఇప్పటికే ప్రపంచంలోని మొత్తం విద్యుత్‌ వాహనాల తయారీలో 60 శాతం వాటాను ఒడిసిపట్టింది. ఈ 60 శాతంలోకూడా అధిక బ్రాండ్లు స్వదేశానివే కావడం విశేషం. ఇక బ్యాటరీల్లోనూ 80 శాతం అక్కడే తయారవుతున్నాయి. వీటిని దెబ్బకొట్టేందుకే ట్రంప్‌ టారిఫ్‌ల కొరడాను ఝుళిపిస్తున్నారు. చైనా పరిశ్రమలను దెబ్బకొడితే అమెరికా పరిశ్రమలకు పునరుజ్జీవం సాధ్యమని ట్రంప్‌ బలంగా నమ్ముతున్నారు. ట్రంప్‌ నిర్ణయం యావత్‌ ప్రపంచ వాణిజ్యవ్యవస్థనే కుదుపునకు గురయ్యేలా చేస్తోంది. 

ఇప్పుడేం జరగొచ్చు? 
అతి టారిఫ్‌ల భారాన్ని అమెరికా తమపై మోపిన నేపథ్యంలో చైనా ముంగిట ఇప్పుడు రెండు మార్గాలున్నాయి. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా టారిఫ్‌లను చైనా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం చైనా తన ఎగుమతి ఆధారిత ఆర్థికవ్యవస్థ విధానాలను అమెరికాకు అనుగుణంగా మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే చైనా గత చరిత్రను చూస్తే ఇది జరగకపోవచ్చని అర్థమవుతుంది. అగ్రగామి ప్రపంచ ఆర్థిక శక్తిగా మారేందుకు ఎన్నాళ్లనుంచో చైనా కలలుకంటోంది. అందుకోసమే ప్రభుత్వ వ్యతిరేకతను ఉక్కుపాదంతో అణిచివేస్తూ దాదాపు ప్రజలందర్నీ ఓ మోస్తరు వృత్తినిపుణులుగా మార్చేసింది. 

ఆట»ొమ్మలు మొదలు ఫోన్‌లదాకా అన్ని వస్తువులు కుటీరపరిశ్రమల్లా ఇళ్లలోనే తయారవుతాయి. చైనాలో ఏం జరుగుతోందనే వివరాలు బయటకు పొక్కకుండా మీడియాపైనా కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి. సొంత టెక్నాలజీనే నమ్ముకున్న ప్రభుత్వం దేశీయ సంస్థలు మినహా చైనా గడ్డపై ఎవరినీ ఎదగనీయదు. ఈ నేపథ్యంలో అమెరికా టెక్నాలజీ కంపెనీలకు చైనా గడ్డపై ఎదిగేందుకు ఒప్పుకోకపోవచ్చు. టారిఫ్‌ల భయాలతో విదేశీ కంపెనీలు చైనాలో పెట్టుబడులను తగ్గించుకుని అమెరికాలో పెట్టుబడులను పెంచుకుంటాయని ట్రంప్‌ భావిస్తున్నారు. చైనాకు ఆర్డర్లు ఇవ్వడం మానేసి అమెరికన్‌ కంపెనీలు మళ్లీ దేశీయంగా కర్మాగారాలను తెరుస్తాయని ట్రంప్‌ ఆశిస్తున్నారు. అదే నిజమైతే మళ్లీ అమెరికాలో కొత్త పారిశ్రామిక విప్లవం రావొచ్చు.  

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement