వ్యతిరేక, అనుకూల వర్గాల ఘర్షణ
మిన్నెపొలిస్: ట్రంప్ సర్కారు వలసల అణచివేత చర్యలపై అమెరికాలో మిన్నెసోటా రాష్ట్రంలోని మిన్నెపొలిస్ అట్టుడుకుతోంది. వలసల వ్యతిరేక, అనుకూల వర్గాల నడుమ ఘర్షణలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జాతీయ భద్రతా దళాలు సిద్ధంగా ఉన్నాయని గవర్నర్ కార్యాలయం తెలిపింది.
వలసల అణచివేతపై నిరసనల్లో భాగంగా శనివారం మిన్నియాపోలీస్ డౌన్‌టౌన్‌లో నిరసన కారులు పెద్ద సంఖ్యలో చేరారు. వారికి వలసలపై అణచివేతకు అనుకూల ఆందోళనకారులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఒకరిపై ఒకరు స్నో బాల్స్, ఇతర నీటి బెలూన్లను విసురుకున్నారు. ముసుగులు ధరించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు ఇళ్ల నుంచి, కార్ల నుంచి ప్రజలను బయటకు లాగడమే కాక.. దూకుడుగా వ్యవహరిస్తున్నారని నిరసనకారులు విమర్శించారు.
తక్కువగా ఉన్న అనుకూల సమూహాన్ని తరిమికొట్టిన నిరసనకారులు, అనుకూల ఆందోళనకారుల్లో ఒకరైన జేక్‌లాంగ్‌ను పట్టుకుని దాడిచేశారు. గతేడాది జనవరి 6న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ క్షమాభిక్ష ప్రసాదించిన వారిలో జేక్ ఉన్నారు. ఆయన బేస్‌బాల్ బ్యాట్‌తో అధికారిపై దాడి చేయడం సహా పలు నేరాలకు పాల్పడినట్లు అభియోగాలున్నాయి. క్షమాభిక్షతో బయటికి వచి్చన జేక్.. ఫ్లోరిడాలోని యూఎస్ సెనేట్‌కు పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు.
మిన్నెపొలిస్, సెయింట్ పాల్ జంట నగరాల్లో వలసలపై అణచివేత చర్యల్లో భాగంగా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఇటీవల 2వేల మందికి పైగా ఫెడరల్ అధికారులను తరలించింది. ఇమ్మిగ్రేషన్ అమలును వేగవంతం చేసింది. నాటి నుంచి ప్రతిరోజూ నిరసనలు జరుగుతున్నాయి. ట్విన్ సిటీస్‌లో జరుగుతున్న ఇమ్మిగ్రేషన్ ఆపరేషన్‌లో ఇటీవల ఒక మహిళ మరణించింది. అమెరికా పౌరురాలైన ఆమెను జనవరి 7న జరిగిన ఘర్షణలో ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్పి చంపారు.
దీంతో శనివారం అధికారులు శాంతియుతంగా నిరసనకారులపై ఎలాంటి నిర్బంధం, టియర్‌గ్యాస్‌ను కూడా ప్రయోగించలేదు. మిన్నెసోటా స్టేట్ ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడటానికే కాదు, శాంతియుతంగా సమావేశమయ్యే ప్రజల హక్కులకు మద్దతు ఇచ్చేందుకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని డెమోక్రటిక్ గవర్నర్ టిమ్ వాల్జ్ తెలిపారు. అయితే, దేశంలో ఉండటానికి హక్కు లేని అక్రమ వలసదారుల అరెస్టు, నిర్బంధం బహిష్కరణ కోసం తాము పోరాడుతూనే ఉంటామని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అసిస్టెంట్ సెక్రటరీ ట్రిసియా మెక్ లాఫ్లిన్ అన్నారు.


