డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు | Donald Trump Sensational Boring Comments On Iran Peace Talks | Sakshi
Sakshi News home page

డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

Jun 3 2026 6:38 AM | Updated on Jun 3 2026 8:31 AM

Donald Trump Sensational Boring Comments On Iran Peace Talks

అమెరికా-ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గుతాయనుకున్న సమయంలో పరిస్థితి మళ్లీ ఊహించని మలుపు తిరుగుతోంది. ఒకవైపు ఇరాన్‌తో జరుగుతున్న చర్చలు సాగుతున్న తరుణంలో.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. తాజాగా ఆయన ఈ చర్చలపై సంచలన వ్యాఖ్యలే చేశారు. మరోవైపు.. కువైట్‌, బహ్రెయిన్‌లపై క్షిపణులు, డ్రోన్ల దాడుల హెచ్చరికలు గల్ఫ్‌ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఈ పరిణామాలు మిడిల్‌ఈస్ట్‌లో  శాంతి ప్రయత్నాల భవిష్యత్తుపై కొత్త సందేహాలు రేకెత్తిస్తున్నాయి.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇరాన్‌తో జరుగుతున్న చర్చలపై చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఇరాన్‌తో చర్చలు కొనసాగుతున్నాయా? ముగిశాయా? అనే ప్రశ్నకు స్పందించిన ట్రంప్‌.. "అవి ముగిసినా నాకు పెద్దగా పట్టదు. ముగిస్తే ముగిశాయి. లేకపోతే లేదు. కానీ అవి చాలా సమయం తీసుకున్నాయి. నిజం చెప్పాలంటే అవి బోరింగ్‌గా మారాయి" అని వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు ట్రంప్‌ దౌత్యపరమైన వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలకు దారి తీశాయి. యుద్ధాలను ముగించడం, శాంతి ఒప్పందాలు కుదుర్చుకోవడం అనేవి ఓర్పు, సహనం, నిరంతర చర్చలు కోరే ప్రక్రియలు. కానీ ట్రంప్‌ స్వభావం మాత్రం తక్షణ ఫలితాలకే ప్రాధాన్యం ఇస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ఇరాన్‌తో అణు కార్యక్రమం, భద్రతా అంశాలపై చర్చలు నెలల తరబడి కొనసాగాల్సి ఉండగా, ట్రంప్‌ ఇప్పటికే విసుగు వ్యక్తం చేయడం ఆందోళన కలిగిస్తోంది.

అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా హయాంలో 2015లో కుదిరిన ఇరాన్‌ అణు ఒప్పందానికి దాదాపు 20 నెలల చర్చలు జరిగాయి. అయితే ప్రస్తుతం ట్రంప్‌ ప్రారంభించిన చర్చలు రెండు నెలలు కూడా పూర్తి కాకముందే అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.

మళ్లీ పరస్పర దాడులు
ఇదిలా ఉండగా గల్ఫ్‌ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కువైట్‌ వైపు దూసుకొచ్చిన క్షిపణులు, డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పేలుళ్ల శబ్దాలకు భయపడవద్దని సూచించింది. అదే సమయంలో బహ్రెయిన్‌ కూడా సైరన్లు మోగించి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది.

ఇరాన్‌కు చెందిన క్వేష్మ్‌ ద్వీప ప్రాంతంలో కూడా పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు అక్కడి మీడియా వెల్లడించింది. అనంతరం అమెరికా సెంట్రల్‌ కమాండ్‌ కీలక ప్రకటన చేస్తూ, ఇరాన్‌ నుంచి ప్రాంతీయ దేశాలపై ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను విజయవంతంగా తిప్పికొట్టామని తెలిపింది. అంతేకాకుండా క్వేష్మ్‌ ద్వీపంలో "స్వీయ రక్షణ చర్యల" కింద దాడులు నిర్వహించినట్లు వెల్లడించింది.

అమెరికా ప్రకారం, ఇరాన్‌ కువైట్‌పై ప్రయోగించిన రెండు బాలిస్టిక్‌ క్షిపణులు లక్ష్యాన్ని చేరకముందే విఫలమయ్యాయి. బహ్రెయిన్‌పై ప్రయోగించిన మూడు క్షిపణులను అమెరికా, బహ్రెయిన్‌ సంయుక్త వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.

కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ అప్పుడప్పుడూ జరుగుతున్న క్షిపణి, డ్రోన్‌ దాడులు పరిస్థితిని మళ్లీ ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఇరాన్‌తో చర్చలు మందగించడం, మరోవైపు గల్ఫ్‌ దేశాలపై దాడుల ముప్పు పెరగడం నేపథ్యంలో ప్రాంతీయ శాంతి ప్రక్రియ మరోసారి అనిశ్చితిలో పడినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా ట్రంప్‌ వ్యాఖ్యలు, అమెరికా తాజా సైనిక చర్యలు పరిస్థితిని మరింత సంక్లిష్టం చేసే అవకాశాలు ఉన్నాయని అంతర్జాతీయ వ్యవహార నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇదీ చదవండి: మోజ్తాబా బతికే ఉన్నారా? అమెరికా ఏమంటోంది..??

Advertisement
 
Advertisement
Advertisement