
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ సుంకాలపై ఆగస్టు ఒకటి వరకూ ఇచ్చిన గడువుకు ముందే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భారత్ తమకు మంచి మిత్రదేశమని, అయితే ఇదే భారత్ ఇతర దేశాల కంటే ఎక్కువ సుంకాలను వసూలు చేసిందని, కానీ తాము అలా చేయబోమని ట్రంప్ పేర్కొన్నారు. తన ఐదు రోజుల స్కాట్లాండ్ పర్యటన ముగించుకుని, వాషింగ్టన్‌కు తిరిగి వస్తూ, ఎయిర్ ఫోర్స్ వన్‌లో ట్రంప్ ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై తాము 20 శాతం నుండి 25 శాతం వరకూ సుంకం రేటు విధించే అవకాశాలున్నాయన్నారు. అయితే ఇందుకు ఆగస్టు ఒకటి వరకూ గడువు ఉందని, దీనికి ముందుగా ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నందున తుది సుంకం ఇంకా ఖరారు కాలేదని ట్రంప్ పేర్కొన్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ దిగుమతులపై చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమయ్యింది. భారత్‌పై 20 నుంచి 25శాతం వరకు సుంకాలు విధించే యోచనలో ఉన్నట్టు ట్రంప్ సూచన ప్రాయంగా ప్రకటించారు. అమెరికా- భారత్ వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్న సమయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. భారత్ దిగుమతులపై 25శాతం వరకు సుంకాలు విధిస్తారా? అని మీడియా అడిగినప్పుడు ఆయన ‘అలా అనుకుంటున్నాను’ అని సమాధానమిచ్చారు.
రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ట్రంప్ అమెరికా ప్రయోజనాల కోసమంటూ ప్రపంచ దేశాలపై భారీ మొత్తంలో సుంకాలు విధించేందుకు ప్రయత్నిస్తున్నారు. తొలుత సుంకాల విధింపునకు 2025 ఏప్రిల్ 2 తుది గడువు పెట్టారు. ఆ సమయంలోపు తమతో ఒప్పందం కుదుర్చుకోవాలన్నారు. ఆ తరువాత ఈ గడువును జూలై 9కి మార్చారు. అనంతరం దానిని ఆగస్ట్ ఒకటి వరకూ పొడిగించారు. కాగా అమెరికా.. యూకే, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, యూరోపియన్ యూనియన్, జపాన్‌లతో వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌తో ఇంకా ఎలాంటి ఒప్పందం నిర్ణయం కాలేదు.