
లైబీరియా అధ్యక్షునికి ట్రంప్ కితాబు
అవమానించారంటూ ఆఫ్రికాలో నిరసనలు
వాషింగ్టన్: ఏదో ఒక వివాదం లేనిదే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు పొద్దుపోవడం లేదు. తాజాగా లైబీరియా అధ్యక్షుడు జోసెఫ్ బొవాకై ఇంగ్లిష్ చాలా బాగుందంటూ ఆయన ఇచి్చన కితాబు కూడా వివాదానికే దారితీసింది. బుధవారం వైట్‌హౌస్‌లో ఐదుగురు ఆఫ్రికా దేశాధినేతలతో భేటీ సందర్భంగా జోసెఫ్ ఇంగ్లిష్ కు ట్రంప్ ముగ్ధుడయ్యారు. ‘‘చాలా బాగా మాట్లాడుతున్నారు. ఇంత చక్కని ఇంగ్లిష్ ఎక్కడ నేర్చుకున్నారు?’’అంటూ ఆరా తీశారు.
ఆయన ధోరణి తమను అవమానించేలా ఉందంటూ లైబీరియాలోనే గాక ఆఫ్రికావ్యాప్తంగా విమర్శలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గ్రామీణ ఆఫ్రికా ప్రాంతాలవాళ్లు నిరక్షర కుక్షులనే ఉద్దేశంలోనే ట్రంప్ వ్యాఖ్యలున్నాయని మండిపడుతున్నారు. దీనిపై లైబీరియా దౌత్యవేత్తలు కూడా అభ్యంతరం వెలిబుచ్చారు. ట్రంప్ తీరుకు నిరసనగా తమ అధ్యక్షుడు వాకౌట్ చేయాల్సిందని లైబీరియన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే వైట్‌హౌస్ ప్రెస్ కరోలినా లెవిట్ ట్రంప్ వ్యాఖ్యలను సమరి్థంచారు. వాటిలో తప్పేమీ లేదని, తమ అధ్యక్షుడు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారని లైబీరియా విదేశాంగ మంత్రి కూడా అన్నారు.
ఆంగ్లమే అధికార భాష
లైబీరియా అధికారిక భాష ఇంగ్లిష్. ఆఫ్రికాలో బానిసత్వం నుంచి విముక్తి పొందిన వారి పునరావాసం నిమిత్తం అమెరికా వలస సమాజం 1822లో ఆ దేశాన్ని ఏర్పాటు చేసింది. 1847లోనే అమెరికా నుంచి స్వతంత్రం ప్రకటించుకుంది. ఆంగ్లంతో పాటు అక్కడ పలు భాషలు మాట్లాడతారు. గతంలో జర్మనీ చాన్సలర్ ఫ్రెడెరిక్ మెర్జ్ ఇంగ్లిష్ నుకూడా ట్రంప్ ఇలాగే మెచ్చుకున్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ‘అమెరికా ఫస్ట్’నినాదంతో భాగంగా ఆంగ్లానికి ఆయన అధిక ప్రాధాన్యమిస్తున్నారు. దాన్ని అమెరికా అధికార భాషగా గుర్తిస్తూ గత మార్చిలో ఉత్తర్వులు కూడా ఇచ్చారు!