ఒకవైపు ప్రపంచ వేదికపై యుద్ధాలు.. మరోవైపు శాంతి బహుమతి కోసం పోటీ. గన్ మోతలు వినిపిస్తున్న వేళ.. తన దౌత్య విజయాలనే కవచంగా చేసుకుని మరోసారి నోబెల్ శాంతి బహుమతి కోసం తన వాదనను తెరపైకి తెచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ‘నేను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాను.. ఇంతకుముందు ఏ అధ్యక్షుడూ ఇలా చేయలేదు’ అంటూ వైట్‌హౌస్ వేదికగా తన రికార్డును మరోసారి గుర్తుచేశారు. అంతేకాదు.. మరో వివాదానికి త్వరలోనే పరిష్కారం చూపే అవకాశం ఉందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా డొనాల్డ్ ట్రంప్.. ‘నేను చేసిన పనులు ఇంతకుముందు ఎవరూ చేయలేదు. గొప్పలు చెప్పుకోవడం కాదు.. వాస్తవాలు చెబుతున్నాను. నేను ఎనిమిది యుద్ధాలను పరిష్కరించాను’ అని అన్నారు. అయితే ఆయన మాటల్లో శాంతి బహుమతిపై ఆశ కూడా దాగి ఉంది. గతంలో పలుమార్లు తనకు నోబెల్ రావాల్సిందేనని చెప్పిన ట్రంప్.. ఈసారి కూడా తన దౌత్య రికార్డునే ప్రధాన అస్త్రంగా మార్చుకున్నారు. కాగా, ట్రంప్ నోబెల్ ఆకాంక్షలకు ఏళ్ల చరిత్ర ఉంది. తొలి అధ్యక్ష పదవీకాలం నుంచే ఉత్తర కొరియాతో ఉద్రిక్తతలు తగ్గించేందుకు తాను చేసిన ప్రయత్నాలను ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. 2018లో కొందరు నార్వే రాజకీయ నాయకులు ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించారు. ఆ తర్వాత కూడా ట్రంప్ తనకు ఈ గౌరవం రావాల్సిందేనని పలుమార్లు వ్యాఖ్యానించారు. 2025లో ఏకంగా ‘నాకు నాలుగైదు సార్లు నోబెల్ రావాల్సింది’ అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో చర్చనీయాంశమయ్యాయి.
‘8 యుద్ధాలు’.. ట్రంప్ చెప్పే జాబితా ఇదే..
తన దౌత్య విజయాలను వివరించేటప్పుడు ట్రంప్ పలు అంతర్జాతీయ వివాదాలను ప్రస్తావిస్తున్నారు. భారత్-పాకిస్తాన్, ఇజ్రాయెల్-ఇరాన్, కంబోడియా-థాయ్‌లాండ్, సెర్బియా-కొసోవో, రువాండా-డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్-ఇథియోపియా, అర్మేనియా-అజర్‌బైజాన్ తదితర అంశాల్లో అమెరికా పాత్రను ఆయన తన విజయాలుగా చెబుతున్నారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ట్రంప్ చెప్పే ‘ఎనిమిది యుద్ధాలు’ అన్న లెక్కపై ఫ్యాక్ట్ చెకర్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఆయన ప్రస్తావిస్తున్న కొన్ని ఘటనలు అధికారికంగా యుద్ధాలే కావని, అలాగే ఒక్కో వివాదంలో అమెరికా పాత్ర కూడా ఒకేలా లేదని వారు చెబుతున్నారు.
ఖండించిన భారత్..
ఇదిలా ఉండగా.. భారత్-పాకిస్తాన్ కాల్పుల విరమణ విషయంలో ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు భారత్ గతంలోనే స్పష్టమైన సమాధానం ఇచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో అమెరికా జోక్యం లేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. సైనిక చర్యలను నిలిపివేయడంపై భారత్, పాకిస్తాన్ మధ్య నేరుగా అవగాహన కుదిరిందని స్పష్టం చేసింది. అయినా ట్రంప్ మాత్రం భారత్-పాక్ ఉద్రిక్తతల పరిష్కారంలో అమెరికా పాత్ర ఉందన్న తన వాదనను కొనసాగిస్తున్నారు.
మిత్రుల నుంచి కూడా మద్దతు..
ట్రంప్ నోబెల్ ఆశలకు ఆయన ఒక్కరే ప్రచారం చేసుకోవడం లేదు. రిపబ్లికన్ ప్రతినిధి క్లాడియా టెన్నీ 2026లో మరోసారి ఆయన పేరును నామినేట్ చేశారు. ఇజ్రాయెల్, పాకిస్తాన్, కంబోడియా నేతలు కూడా ట్రంప్ పేరును ప్రతిపాదించినట్లు బహిరంగంగా ప్రకటించారు. అయితే నామినేషన్ వచ్చిందంటే నోబెల్ కమిటీ ఆ అభ్యర్థిని సమర్థించినట్లు మాత్రం కాదు. 2026 శాంతి బహుమతికి మొత్తం 287 మంది అభ్యర్థులు పరిశీలనలో ఉన్నారు.
ట్రంప్‌నకు అడ్డంకి..
ట్రంప్ నోబెల్ కలకు అసలు పరీక్ష ఎక్కడ ఉందంటే.. ప్రస్తుతం ప్రపంచం చూపు ఇరాన్‌వైపే ఉంది. తాను శాంతి స్థాపకుడినని చెబుతున్న ట్రంప్ పాలనలోనే ఇరాన్‌తో తీవ్ర ఘర్షణ కొనసాగుతోంది. దీంతో ఆయన దౌత్య రికార్డుపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయినా ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాలు ఆపానంటూ మరోసారి తన రికార్డును ప్రపంచం ముందు పెట్టారు. మరి ఈసారి నోబెల్ తలుపు ట్రంప్ కోసం తెరుచుకుంటుందా? లేక ఆయన ‘శాంతి పిలుపు’ మరోసారి ప్రకటనలకే పరిమితమవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: ఇరాన్‌పై మరో ట్విస్ట్.. ట్రంప్‌కు కొత్త టెన్షన్


