
అమెరికాలోనే ఉత్పత్తి చేయాలని ట్రంప్ సూచన
లేకపోతే 25 శాతం టారిఫ్ తప్పదని స్పష్టీకరణ
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ ప్రఖ్యాత తయారీ సంస్థలను టారిఫ్‌ల పేరిట బెదిరింపులకు గురి చేస్తున్నారు. ఆయా కంపెనీలు అమెరికాలోనే వస్తువులు, సరుకులు ఉత్పత్తి చేయాలని, లేకపోతే సుంకాల బాదుడుకు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఆయన యాపిల్ కంపెనీకి ఇప్పటికే హెచ్చరికలుజారీ చేశారు. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ సంస్థకు సైతం ఇప్పుడు అదే పరిస్థితి ఎదురయ్యింది.
అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే 25 శాతం టారిఫ్ విధిస్తామని సామ్‌సంగ్‌కు ట్రంప్ తేల్చిచెప్పారు. ఆయన తాజాగా వైట్‌హúస్‌లో మీడియాతో మాట్లాడారు. అణు విద్యుత్ ఉత్పత్తిని మరింత పెంచడానికి ఉద్దేశించిన ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలో ఎల్రక్టానిక్ ఉత్పత్తులు విక్రయించుకొనే ఏ సంస్థ అయినా సరే వాటిని ఇక్కడే తయారు చేయాలని, లేనిపక్షంలో సుంకాలు చెల్లించడానికి సిద్ధంగా ఉండాలని స్పష్టంచేశారు. తయారీ ప్లాంట్లను అమెరికాలో నెలకొల్పితే ఎలాంటి టారిఫ్‌లు ఉండవని చెప్పారు.
మరెక్కడో తయారు చేసి, ఇక్కడ విక్రయించుకొని, సొమ్ము చేసుకుంటామంటే అది సరైన పద్ధతి కాదని పేర్కొన్నారు. ఐఫోన్లను అమెరికాలో ఉత్పత్తి చేయకపోతే యాపిల్ కంపెనీపై 25 శాతం టారిఫ్‌లు విధించడం తథ్యమని ట్రంప్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. యాపిల్ కంపెనీకి సంబంధించి 90 శాతం ఫోన్లు చైనాలోనే తయారవుతున్నాయి. అక్కడి ప్లాంట్లను భారత్‌కు తరలించేందుకు యాపిల్ సిద్ధమవుతోంది. ఇంతలోనే ట్రంప్ కన్నెర్ర చేశారు. మరోవైపు సామ్‌సంగ్‌కు చైనాలో తయారీ ప్లాంట్లు లేవు. చివరి ప్లాంట్ 2019లో మూతపడింది. సామ్‌సంగ్ ఫోన్లు, ఎల్రక్టానిక్ ఉత్పత్తులు ఎక్కువగా భారత్, దక్షిణ కొరియా, వియత్నాం, బ్రెజిల్‌లోనే తయారవుతున్నాయి.
భారత్‌లోనే తయారు చేస్తారా? మీ ఇష్టం..
యాపిల్ కంపెనీకి ట్రంప్ మరోసారి అల్టిమేటం జారీ చేశారు. ‘‘ఐఫోన్ల తయారీ ప్లాంట్లను చైనా నుంచి భారత్‌కు తరలించుకోవాలంటే తరలించుకోండి. మేము వద్దనడం లేదు. కానీ, ఐఫోన్లను అమెరికాలో విక్రయించుకోవాలంటే మాత్రం సుంకాలు చెల్లించాల్సిందే. సుంకాలు లేకుండా మీరు ఐఫోన్లు ఇక్కడ అమ్ముకోలేరు’’అని పేర్కొన్నారు.