
లక్కీ డిప్‌గా అందులో వచ్చిన బిల్లుపైనా చర్చ
న్యూజిలాండ్‌లో కొనసాగుతున్న వింత సంప్రదాయం
వెల్లింగ్టన్: అత్యవసర సమయాల్లో అక్కర కొస్తాయని డబ్బును ఇంట్లో అమ్మవాళ్లు పోపుల డబ్బాల్లో దాస్తారు. అదే తరహాలో దేశ భవిష్యత్‌ను నిర్దేశించే ప్రతిపాదిత బిల్లులను న్యూజిలాండ్ పార్లమెంటేరి యన్లు బిస్కెట్ డబ్బాలో పెడతారు. అందులోంచి ఎంపిక చేసిన బిల్లుపైనే చర్చ జరుపుతారు. ఈ వింత సంప్రదాయ న్యూజిలాండ్‌లో 20వ శతాబ్దం నుంచే ఉంది.
గురువారం పార్లమెంట్‌లో బిల్లులపై చర్చ సందర్భంగా మళ్లీ ఆ బిస్కెట్ డబ్బాను తీసుకురావడంతో ఇప్పుడిది చర్చనీయాంశమైంది. సాధారణంగా పార్ల మెంట్ కీలక అజెండాలో ఉన్న బిల్లులను ఈ కుకీ టిన్‌లో వేయరు. గతంలో కొత్త చట్టాలకు సంబంధించి మంత్రులుకాని సభ్యుల నుంచి ఏమైనా ప్రతిపాదనలు వస్తే వాటిల్లో దేనిని చర్చించాలనే మీమాంస మొదలైంది.
ఎవరికి వారు తమ ప్రతిపాదనపైనే చర్చ జరపాలని పట్టు బట్టారు. వీటికి ప్రజాస్వామ్యయుతంగా చెక్ పెట్టేందుకే ఈ బిస్కెట్ డబ్బాను తెచ్చారు. 1990 దశకంలో వెల్లింగ్టన్ సిటీలోని ‘డేకా’సంస్థ సరకుల దుకాణం నుంచి పార్లమెంట్ ఉద్యోగి ఒకరు ఈ బిస్కెట్ డబ్బాను తీసుకొచ్చారు. సభ్యుల బిల్లుల సంబంధించిన టోకెన్లను ఈ డబ్బాలో వేస్తారు. వైజ్ఞానిక సందర్శనలో భాగంగా పార్లమెంట్‌కు వచ్చిన విద్యార్థు లు లేదా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులతో ఈ డబ్బాలోని టోకెన్‌ను లక్కీడిప్ తరహాలో తీయిస్తారు. అలా తీసిన బిల్లుపై మాత్రమే చర్చ జరుపుతారు.
న్యూజిలాండ్‌లో కొన్ని కీలక చట్టాలుగా రూపుదాల్చిన కొన్ని ప్రతిపాదిత బిల్లులు సైతం ఇలా బిస్కెట్ డబ్బా నుంచే లక్కీ డిప్‌లో ఎంపికచేసినవే కావడం విశేషం. వివాహంలో సమానత్వ చట్టం, కారుణ్య మరణాలకు బాటలు వేసిన చట్టాలు ఇలా వచ్చినవే. ‘‘కొత్త డబ్బాను తెచ్చి అందులోని బిస్కెట్లన్నీ తినేస్తాం. తర్వాత ఒకటి, రెండు అంటూ 90 దాకా టోకెన్లు వేస్తాం. అందులో వచ్చిన టోకెన్ నంబర్ ఉన్న ప్రతిపాదిత బిల్లుపైనే చర్చ జరు పుతారు’’అని న్యూజిలాండ్ దిగువసభలో క్లర్క్ అయిన డేవిడ్ విల్సన్ చెప్పారు.