భారత్‌ హెచ్చరికలు బేఖాతరు.. శ్రీలంక చేరిన చైనా ‘స్పై షిప్‌’

Chinese Ship Docked SriLanka Hambantota Port Amid India Concern - Sakshi

కొలంబో: చైనాకు చెందిన ఉన్నతస్థాయి పరిశోధక నౌక శ్రీలంకలోని హంబన్‌తోటా నౌకాశ్రయానికి మంగళవారం చేరుకుంది. స్పై షిప్‌ రాకపై భారత్‌ భద్రతాపరమైన ఆందోళనలు వ్యక్తం చేసిన కొద్ది రోజుల్లోనే పోర్టుకు చేరుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వాంగ్‌ యాంగ్‌ 5 నౌక శ్రీలంక పోర్టుకు చేరుకున్నట్లు హర్బర్‌ మాస్టర్‌ కెప్టెన్‌ నిర్మల్‌ డీ సిల్వా తెలిపారు.

పొరుగు దేశంలో చైనా నౌక ఉండటంపై భారత్‌ ఇటీవలే ఆందోళన వ్యక్తం చేసింది. భారత్‌కు చెందిన వ్యవస్థలపై నిఘావేసే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో షిప్‌ రాకను వాయిదా వేసుకోవాలని చైనాకు సూచించింది శ్రీలంక. అయితే, చైనా ఒత్తిడికి తలొగ్గి గత శనివారం అనుమతులు జారీ చేసింది. ఆగస్టు 16 నుంచి 22 మధ్య నౌక తమ పోర్టులో ఉండేందుకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ‘చైనాకు చెందిన వాంగ్‌ యాంగ్‌ 5 నౌక నిర్వహణలో పొరుగు దేశం భద్రతకే అధిక ప్రాధాన్యం ఉంటుంది. అందరి ఆందోళనలను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.’ అని శ్రీలంక విదేశాంగ శాఖ ఓ ప్రకటన చేసింది. 

అంతకు ముందు భారత్‌, అమెరికాల ఆందోళనలను తప్పుపట్టింది చైనా. శ్రీలంకపై ఒత్తిడి పెంచేందుకు భద్రతాపరమైన అంశాలను లేవనెత్తటం పూర్తిగా అసంబద్ధమని పేర్కొంది. చైనా సముద్ర శాస్త్ర పరిశోధన కార్యకలాపాలను హేతుబద్ధమైన కోణంలో చూడాలని, చైనా, శ్రీలంక మధ్య సహకారానికి అంతరాయం కలిగించకుండా ఆపాలని సంబంధిత పక్షాలను కోరుతున్నామని చెలిపారు డ్రాగన్‌ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌.

ఇదీ చదవండి: భారత ఆందోళనను లెక్కచేయని శ్రీలంక.. చైనా నిఘా నౌకకు అనుమతి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top