విదేశీ భార్యల మోజులో పడొద్దు | China warns against marriage scams in Bangladesh | Sakshi
Sakshi News home page

విదేశీ భార్యల మోజులో పడొద్దు

May 27 2025 5:47 AM | Updated on May 27 2025 7:40 AM

China warns against marriage scams in Bangladesh

ఢాకాలోని చైనా దౌత్య కార్యాలయం హెచ్చరిక

ఢాకా: బంగ్లాదేశ్‌కు చెందిన ఆన్‌లైన్‌ డేటింగ్, పెళ్లిళ్ల బ్యూరోల వలలో పడొద్దని చైనా ఎంబసీ తమ పౌరులను హెచ్చరించింది. తమ దేశంలో యువతుల కొరత ఏర్పడటంతో కొందరు అక్రమ మార్గంలో పెళ్లిళ్లు చేసుకుంటున్నట్లు చైనా ప్రభుత్వం గుర్తించింది. అయితే, వీటి కారణంగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతు న్నట్లు గుర్తించింది. దీనిపై తాజాగా పౌరులకు హెచ్చరికలు జారీ చేసిందని చైనా ప్రభుత్వ ‘గ్లోబల్‌ టైమ్స్‌’పేర్కొంది. 

ఆన్‌లైన్‌లోని షార్ట్‌ వీడియో వేదికలపై వచ్చే మోసపూరిత ‘క్రాస్‌–బోర్డర్‌ డేటింగ్‌’వలలో పడొద్దని కోరింది. అనధికార నెట్‌వర్క్‌లు, పెళ్లిళ్ల బ్యూరోల్లో ‘ఫారిన్‌ వైవ్స్‌’అంటూ వచ్చే ప్రకటనలను చూసి మోసపోవద్దని పేర్కొంది. ఇలాంటి వాటిపై చైనాలో నిషేధం ఉందని వెల్లడించింది. విదేశీయులను భార్య లుగా తెచ్చుకోవాలన్న ఆలోచన మానుకోవాలంది. బంగ్లాదేశీ యులను పెళ్లి చేసుకునేముందు అన్ని వివరాలను కూలంకషంగా తెలుసుకోవాలని సూచించింది. 

ఒకే సంతానం అనే కఠిన మైన విధానాన్ని చైనా ప్రభుత్వం ఎత్తి వేయడం, జంటలు మగ సంతానం వైపు చూపుతున్న మొగ్గుతో జనాభాలో లింగపరమైన అసమతుల్యత తీవ్రరూపం దాల్చింది. చైనాలో ప్రస్తుతం దాదా పు 3 కోట్లు మంది పురుషులు అవివాహితులుగా మిగిలిపోయి నట్లు అంచనా. దీంతో, విదేశీ మహిళలను పెళ్లి చేసుకునే ఆలోచనలో ఎక్కువమంది ఉంటున్నారు. పెళ్లి పేరుతో బంగ్లాదేశీ మహిళలను చైనీయులకు విక్రయించిన కేసులు ఇటీవల వెలుగులోకి వచ్చాయి.

 ఈ అక్రమ రవాణా దందా వెనుక నేరగాళ్ల ముఠాలు ఉన్నట్లు తేలింది. బెదిరించి, చట్ట విరుద్ధంగా చేసుకునే ఇలాంటి పెళ్లిళ్లతో న్యాయపరమైన సమస్యలు ఏర్పడుతున్నట్లు గుర్తించారు. అక్రమ పెళ్లిళ్ల దందాకు వేదికగా మారిన పెళ్లిళ్ల బ్యూరోలపై చైనా ప్రభుత్వం నిషేధం విధించింది. అక్రమ సంబంధాలు, పెళ్లిళ్ల బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే తమను సంప్రదించాలని కూడా చైనా రాయబార కార్యాలయం కోరింది. 

బంగ్లాదేశ్‌ మహిళలతో చట్ట విరుద్ధంగా లైంగిక సంబంధాలు పెట్టుకునే వారు మానవ అక్రమ రవాణా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. బంగ్లాదేశ్‌ చట్టాల ప్రకారం మానవ అక్రమ రవాణాకు పాల్పడిన వారికి కనిష్టంగా ఏడేళ్ల జైలు శిక్ష, జరిమానా, గరిష్టంగా జీవిత ఖైదు, రూ.16 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంటుంది. కొన్ని ముఠాలు బంగ్లాదేశ్‌ మహిళలను పొరుగునున్న భారత్‌కు అక్రమంగా తరలిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. టిక్‌టాక్‌ ద్వారా మహిళలను వేశ్యావృత్తిలోకి దించుతున్న 11 మందిని గతంలో ఢాకా పోలీసులు అరెస్ట్‌ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement