
భారత్-పాక్ యుద్ధంపై చైనా స్పందించింది. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఆ దేశం ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్‌ల మధ్య జరుగుతున్న సైనిక దళాల ఘర్షణపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి లిన్ జియాన్ మాట్లాడుతూ.. భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా కానీ చైనా వ్యతిరేకిస్తుందంటూ ఆయన స్పష్టం చేశారు.
పొరుగు దేశాలైన భారత్-పాక్ అంతర్జాతీయ చట్టాలను పాటిస్తూ.. శాంతి, స్థిరత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పరిస్థితిని మరింత క్లిష్టతరం చేసే చర్యలకు పాల్పడకుండా సంయమనం పాటించాలని కోరారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి.. అంతర్జాతీయ సమాజంతో కలిసి.. నిర్మాణాత్మక పాత్ర పోషించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.
కాగా, భారత్–పాకిస్తాన్ మధ్య ఘర్షణలు పూర్తిగా ఆగిపోవాలని కోరుకుంటున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించిన సంగతి తెలిసిందే. ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నట్టుగా భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయని వెల్లడించారు. మొదట ఉగ్రవాదులు దాడి చేశారు కాబట్టి తర్వాత భారత సైన్యం ప్రతిదాడి చేసిందని పరోక్షంగా అంగీకరించారు.
ఇప్పటిదాకా జరిగింది చాలు, ఇకనైనా ఘర్షణలకు తెరదించాలని భారత్, పాక్‌లకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తన వంతు సాయం అందించడానికి సిద్ధంగా ఉన్నానని సూచించారు. భారత్, పాక్ మధ్య శాంతి కోసం తాను చేయగలిగినదంతా చేస్తానని ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం వైట్‌హౌస్ ఓవల్ ఆఫీసులో ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడారు. తన విజ్ఞప్తిని మన్నించి దాడులకు తెరదించాలని భారత్, పాక్‌లకు సూచించారు.