
వాతావరణంలోకి విడుదలవుతున్న ప్రమాదకర వాయువులు
ఆహారం వృథాలో చైనాది మొదటి స్థానం
ఆ తర్వాత భారత్, పాకిస్తాన్‌లే
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది టన్నుల ఆహారం ఉత్పత్తి అవుతుంది. కొన్ని దేశాలలో ఉత్పత్తి చేసిన ఆహారంలో చాలా భాగం వృథా అవుతోంది. ఇక్కడ ఫుడ్ వేస్ట్ అవడమే కాదు అది మళ్లీ మనకే ప్రాణాంతకమవుతోంది. ఈ వృథా ఆహార పదార్థాలు చెత్త డంపుల్లో పడి మీథేన్ వంటి ప్రమాదకర గ్రీన్‌హౌస్ వాయువులను విడుదల చేస్తుంది. ఇది కార్బన్ డయాక్సైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరం.
ప్రపంచ గ్రీన్‌హౌస్ గ్యాస్ ఉద్గారాల్లో ఆహారం వృథా కారణంగా 8 నుంచి 10% వరకు ఉంటున్నాయి. అలాగే 30% వ్యవసాయ భూమిని ఆహార పదార్థాలకు మాత్రమే ఉపయోగిస్తున్నాం. మీకు తెలుసా? ఒక ఇంట్లో ప్రతి వ్యక్తి ఏడాదికి సగటున 132 కిలోగ్రాముల ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. అలాగే, ప్రపంచదేశాలు ఏటా 1 లక్ష కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆహారాన్ని వదిలేస్తున్నాయి. మరో విషాదమేమంటే.. ఇంత ఆహారం వృతా అవుతున్నా ప్రపంచంలో 78.3 కోట్ల మంది ఆకలితో అలమటిస్తుండటం..!
చైనా.. భారత్.. పాకిస్తాన్..
ఆహార వృథా సమస్య తీవ్రతపై 2024లో ఓ నివేదిక విడుదలైంది. ఇందులోని డేటాలో ప్రపంచంలోని ఏఏ దేశాల వాళ్లు ఎక్కువ ఆహారాన్ని వృధా చేస్తున్నారో తెలిపారు. ఆహారం వృథా చేసే దేశాల్లో మొదటి స్థానాన్ని చైనా ఆక్రమించింది. ప్రపంచంలోనే ఎక్కువ జనాభా కలిగిన దేశాలలో చైనా ఒకటి. చైనాలో సంవత్సరానికి 108 మిలియన్ టన్నులకు పైగా ఆహారాన్ని వృథా అవుతోంది. అంటే చైనాలో ప్రతి వ్యక్తి సంవత్సరానికి 76 కేజీల ఆహారాన్ని వృధా చేస్తున్నాడన్నమాట.
ఇక రెండో స్థానంలో ఉన్నది మనమే. మనదేశంలో సంవత్సరానికి 78 మిలియన్ టన్నులకు పైగా ఆహారం వృథా అవుతోంది. దేశ జనాభా ఎక్కువ కాబట్టి ప్రతి భారతీయుడు సంవత్సరానికి 54 కేజీలు వృథా చేస్తాడు. అసమర్థ స్టోరేజ్, రవాణా లోపాలు, వ్యవసాయ క్షేత్రం నుంచి మార్కెట్‌కు తరలించేటప్పుడు ఆహారం చెడిపోవడం..వంటివి ఫుడ్ వేస్ట్ అవడానికి ప్రధాన కారణాలు. మూడో స్థానం పాకిస్తాన్. ఇక్కడ ఏడాదికి 31 మిలియన్ టన్నుల ఆహారం వృథా అవుతోంది. అయితే సగటున ప్రతి వ్యక్తి 122 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నాడు. ప్రపంచంలో ఆహారం వృథా అయ్యేది ఇక్కడే.
నిల్వ వసతులు లేమి
ఆహార వృథాలో నాలుగో స్థానం నైజీరియాది. ఇక్కడ 24.8 మిలియన్ టన్నుల వృథాతో సగటున ఒక్కో వ్యక్తి 106 కేజీల ఆహారం వృథా చేస్తున్నాడు. ఇక్కడ వృథా ఎక్కువగా వినియోగదారుల నుంచి కాకుండా కోల్డ్ స్టోరేజ్ లేకపోవడం, రవాణా సమస్యలు, మార్కెట్ యాక్సెస్ లోపాలతో వృథా అవుతోంది. ఐదో స్థానంలో అమెరికా ఉంది. అమెరికాలో ప్రతి ఏటా దేశం మొత్తంలో 24 మిలియన్ టన్నులు ఆహారం వృథా అవుతండగా లగటు ప్రతి వ్యక్తి 71 కేజీలు వృథా చేస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా రెస్టారెంట్లు, సూపర్‌మార్కెట్లలో ఆహారం వృథా అవుతుంది. ఆరో స్థానంలో బ్రెజిల్.
సంవత్సరానికి 20 మిలియన్ టన్నులు పైగా, ప్రతి వ్యక్తికి 95 కేజీలు ఆహారాన్ని వృథా చేస్తున్నారు. ఏడో స్థానంలో ఈజిప్ట్ ఉంది. 18 మిలియన్ టన్నులతో ప్రపంచంలోనే అత్యధికంగా ప్రతి వ్యక్తి 155 కేజీలు వృథా చేస్తున్నారు. ఎనిమిదో స్థానంలో ఇండోనేసియా ఉంటుంది. 15 మిలియన్ టన్నులతో ప్రతి వ్యక్తి 52 కేజీలు వృథా చేస్తున్నాడు. తొమ్మిదో స్థానంలో బంగ్లాదేశ్. 4 మిలియన్ టన్నులు పైగా, కానీ వ్యక్తికి 82 కేజీల చొప్పున వృధా అవుతోంది. బంగ్లాదేశ్ లాంటి దేశానికి ఇది చాలా ఎక్కువ. చివరి స్థానంలో మెక్సికో నిలిచింది. ఏడాదికి 13.4 మిలియన్ టన్నుల మేర వృథా అవుతుంది. సగటున ప్రతి వ్యక్తి 102 కేజీలు ఆహారం వృథా అవుతోంది.
మనం ఏమి చేయగలం?
అవసరమైన మేరకే కొనుగోలు చేయడం, వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చుకోవడం, ఫుడ్ బ్యాంకులకు డొనేట్ చేయడం వంటి చిన్న మార్పులతో పెద్ద తేడా తీసుకురావచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. మార్పు మన నుంచే మొదలుకావాలన్నది తెలుసుకోవాల్సిన ముఖ్యమైన అంశం. ఆ తర్వాతే సమాజం, దేశంతో పాటు ప్రపంచం కూడా మారుతాయి. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం అవసరం. అదే ఆహారం మనకే విషమైతే..? మనుగడ ప్రశ్నార్థకమవుతుంది..!