
ఒట్టావా: అమెరికా-కెనడా మధ్య ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందంటున్నారు కెనడా ప్రధాని మార్క్ కార్నీ(Mark Carney). ఆటో ఉత్పత్తులపై సుంకాలు విధింపుపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేసిన నేపథ్యంలోనే కార్నీ ఇలా ఘాటుగా వ్యాఖ్యానించారు.
ఆటో ఉత్పత్తులపై 25శాతం సుంకాలు విధిస్తానంటూ ట్రంప్(Trump Tariffs) తాజాగా వ్యాఖ్యానించారు. వచ్చే వారం నుంచి ఇది అమల్లోకి రానుండగా.. ఈ నిర్ణయం ఐదు లక్షల మంది ఉద్యోగులు పని చేసే కెనడా ఆటో పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించనుంది. ఈ నేపథ్యంలో తన ఎన్నికల ప్రచారాన్ని సైతం పక్కన పెట్టి మరీ కార్నీ ఒట్టావా చేరుకుని కేబినెట్ భేటీ నిర్వహించారు.
ట్రంప్ ఆటో టారిఫ్‌లను అన్యాయంగా అభివర్ణించిన కార్నీ.. ఇరు దేశాల మధ్య ఉన్న వాణిజ్య ఒప్పందాలను ఉల్లంఘించడమే అవుతుందని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల ఆర్థిక, భద్రత, మిలిటరీ సంబంధాల శకం ముగిసిందని వ్యాఖ్యానించారు. అలాగే.. ట్రంప్ ఆటో టారిఫ్‌లకు కెనడా ప్రతిచర్య కచ్చితంగా ఉంటుందని స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే.. జస్టిన్ ట్రూడో స్థానంలో మార్క్ కార్నీ కెనడాకు ప్రధాని అయ్యారు. సాధారణంగా కెనడా ప్రధాని బాధ్యతలు చేపట్టాక అగ్రరాజ్య అధ్యక్షుడితో ఫోన్ కాల్ మాట్లాడడం ఆనవాయితీగా వచ్చేది. అయితే కార్నీ దానిని బ్రేక్ వేశారు. ఇప్పటిదాకా ఆయన ట్రంప్‌తో మాట్లాడకపోవడం గమనార్హం. ట్రంప్‌తో మాట్లాడడానికి తనకేమీ అభ్యంతరాలు లేవని.. అయితే తన దేశానికి తగిన గౌరవం ఇస్తేనే అది జరుగుతుందని కార్నీ ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే.. రాబోయే రెండు, మూడో రోజుల్లో ఇరు దేశాల అధినేతలు మాట్లాడుకోవచ్చని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి.
ఇదీ చదవండి: కెనడా ప్రధాని మార్క్ కార్నీ.. అసలు ఎవరీయన?