కెనడా-భారత్ మధ్యసంబంధాలు ప్రస్తుతం కొంత మెరుగుపడ్డాయి. ఇటీవలే ఇరుదేశాలు తమ రాయబారులను నియమించుకున్నాయి. ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం భారత్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ భారత్ తరపునే కెనడాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేసింది.
భారత్- కెనడా మధ్య ప్రస్తుతం ఇప్పుడిప్పుడే పరిస్థితులు సద్దుమణుగుతున్నాయి. ఇంతకాలం రెండుదేశాల మధ్య సంబంధాలు మెరుగ్గాలేవు. ఆ దేశంలో ఖలిస్థాన్ అనుకూల వాదులు ఎక్కువగా ఉండడం వారు తరచుగా భారత్‌ని విమర్శించడం జరిగేది. అంతే కాకుండా 2023లో హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉండవచ్చని అప్పటి ఆ దేశ ప్రధాని జస్టిస్ ట్రూడో ప్రకటించారు. దీంతో ఈ ప్రకటనను భారత్ పూర్తిగా ఖండించింది. ఇరుదేశాల మధ్య సంబంధాలు పూర్తిగా క్షీణించాయి. కాగా ఇప్పుడిప్పుడే ఇరు దేశాల మధ్య సంబంధాలు తిరిగి మెరుగుపడే దశలో ఉన్నాయి.
ఈ నేపథ్యంలో కెనడా ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. కెనడా పోలీసుల నివేదికలో" లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ చాలా హింసాత్మక మైన క్రూర సంస్థ ఇది తన క్రిమినల్ చర్యలను కెనడాతో పాటు ఇతర దేశాల్లో విస్తరిస్తుంది. ఇది భారత ప్రభుత్వం తరపునే తన క్రిమినల్ చర్యలను కొనసాగిస్తుంది" అని నివేదికలో పేర్కొన్నారు.
అంతేకాకుండా ఈ గ్యాంగ్ మాదకద్రవ్యాల రవాణా మనీ లాండరింగ్ వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడుతుందని తెలిపారు. ఈ గ్యాంగ్ ప్రధాన ఉద్దేశం మత సంబంధిత కారణాలు కాదని దురాశ మాత్రమేనని పోలీసులు పేర్కొన్నారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌ను కెనడా ప్రభుత్వం ఇదివరకే ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.
పంజాబ్‌కు చెందిన ఈ లారెన్స్ బిష్ణోయ్ పెద్ద గ్యాంగ్ స్టార్. ఇతని గ్యాంగ్ సభ్యులు దేశవ్యాప్తంగా ఉన్నారు. ప్రస్తుతం బిష్ణోయ్ సబర్మతీ జాతీయ కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ఇతనిపై భారత్‌లో అనేక కేసులు నమోదయ్యాయి.


