
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ తన లండన్ పర్యటనలో జూలై 24న సంతకం చేయనున్న భారత్- యూకేల స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదం తెలిపిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇరు దేశాల మధ్య సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందంగా ఇది నిలవనుందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. భారత్-యూకేల మధ్య ఈ వాణిజ్య ఒప్పందం కోసం జరిపిన చర్చలు ముగిసినట్లు ఇరు దేశాలు మే 6న ప్రకటించాయి.
ప్రధాని మోదీ చేపట్టే యునైటెడ్ కింగ్‌డమ్, మాల్దీవుల నాలుగు రోజుల పర్యటన బుధవారం(జూలై 23)ప్రారంభంకానుంది. ఈ పర్యటనలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ ప్రధానమంత్రి వెంట ఉండనున్నారు. కాగా 2030 నాటికి ఈ రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య వాణిజ్యాన్ని 120 బిలియన్ డాలర్లకు రెట్టింపు చేసేదిగా ఈ ఒప్పందం ఉంది. తోలు, పాదరక్షలు, దుస్తులు వంటి శ్రమతో కూడిన ఉత్పత్తుల ఎగుమతిపై పన్నులను తొలగించాలని, బ్రిటన్ నుండి విస్కీ, కార్ల దిగుమతులను చౌకగా మార్చాలని ఈ వాణిజ్య ఒప్పందం ప్రతిపాదించింది.
భారత్-యూకేల ఈ ఒప్పందంలో వస్తువులు, సేవలు, ఆవిష్కరణ, మేధో సంపత్తి హక్కులు తదితర అంశాల ప్రస్తావన ఉంది. ఈ ఒప్పందంపై ఇరు దేశాల వాణిజ్య మంత్రులు సంతకం చేయనున్నారు. అనంతరం దీనిని అమలు చేసేందుకు బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. మరోవైపు సామాజిక భద్రతా ఒప్పందంపై రెండు దేశాలు చర్చలు జరిపాయి. కాగా ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం (బిట్)పై చర్చలు కొనసాగుతున్నాయి. 2024-25లో యూకేకి భారతదేశ ఎగుమతులు 12.6 శాతం పెరిగాయి. దిగుమతులు 2.3 శాతం మేరకు పెరిగాయి. భారత్-యూకేల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2022-23లో20.36 యూఎస్ బిలియన్ డాలర్ల నుండి 2023-24లో 21.34 యూఎస్ బిలియన్ డాలర్లకు పెరిగింది.