అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై బ్రిటన్ ప్రతిపక్ష నేత, లిబరల్ డెమొక్రాట్ పార్టీ అధ్యక్షుడు ఎడ్వర్డ్ జోనాథన్ డేవీ తీవ్రస్ధాయిలో మండిపడ్డారు. బ్రిటీష్ పార్లమెంట్‌లో ప్రసంగించిన సర్ ఎడ్ డేవీ.. ట్రంప్‌ను అత్యంత ఘాటైన పదజాలంతో విమర్శించాడు. ఆయన ట్రంప్‌ను ఓ ఇంటర్నేషనల్ గ్యాంగ్‌స్టర్‌గా అభివర్ణించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత అవినీతిపరుడైన అధ్యక్షుడు అని సర్ డేవీ మండిపడ్డారు.
ఈ విమర్శలకు కారణమేంటంటే..?
డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్‌లాండ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్నాడు. గ్రీన్‌లాండ్‌ను అమెరికాకు విక్రయించాలని లేదా తమ దేశంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాడు. ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ తిరస్కరించింది.
డెన్మార్క్ నిర్ణయానికి బ్రిటన్‌తో పాటు పలు ఐరోపా దేశాలు మద్దతు ఇచ్చాయి. దీంతో ఆగ్రహించిన ట్రంప్.. గ్రీన్‌లాండ్ విషయంలో తమకు సపోర్ట్ చేయని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ సహా ఎనిమిది యూరప్ దేశాలపై ఫిబ్రవరి నుంచి 10 నుంచి 25 శాతం వరకు దిగుమతి సుంకాలు విధిస్తానని ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం బ్రిటన్ పార్లమెంట్‌లో చర్చ జరిగింది.
ఈ సందర్భంగా సర్ డేవీ మాట్లాడుతూ.. ట్రంప్ అంతర్జాతీయ గ్యాంగ్‌స్టర్‌లా ప్రవర్తిస్తున్నారు. మిత్రదేశాల సార్వభౌమాధికారాన్ని కాలరాస్తూ, ఆర్థిక ఒత్తిడితో అందరినీ భయపెట్టాలని చూస్తున్నారు" అని విమర్శలు గుప్పించారు. కేవలం పుతిన్, షీ జిన్‌పింగ్ వంటి వారే ట్రంప్‌కు మద్దతు ఇస్తున్నారని, ఇది నాటో కూటమిని బలహీనపరుస్తుందని ఆయన పేర్కొన్నాడు.
ఫ్రాన్స్‌తో కూడా విభేదాలు
ట్రంప్ కేవలం బ్రిటన్ మాత్రమే కాకుండా ఫ్రాన్స్‌ను కూడా హెచ్చరించాడు. ట్రంప్ ప్రతిపాదించిన 'బోర్డ్ ఆఫ్ పీస్' లో చేరనందుకు, ఫ్రెంచ్ వైన్, షేంపేన్లపై 200 శాతం సుంకం విధిస్తామని బెదిరించాడు. దీనిని ఫ్రాన్స్ తీవ్రంగా ఖండించింది.


