బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల ఢిల్లీలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో హసీనా ఆడియో సందేశం ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.
యూనస్ ఒక హంతక ఫాసిస్ట్, వడ్డీ వ్యాపారి, డబ్బు అక్రమంగా తరలించేవాడు, అధికార దాహం గల దేశద్రోహి అని హసీనా మండిపడ్డారు. తాజాగా ఆమె వ్యాఖ్యలపై యూనస్ సర్కార్ స్పందించింది. "మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారన్న కేసులో ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ దోషిగా తేల్చిన షేక్ హసీనాను ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించడానికి అనుమతించడం ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇలాంటి చర్యలు ఇరు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను దెబ్బతీస్తాయని, ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకరం. ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం షేక్ హసీనాను తమకు అప్పగించాలని తాము పదేపదే కోరుతున్నా, భారత్ స్పందించకపోవడం మమ్మల్ని అసంతృప్తికి గురిచేస్తోంది"బంగ్లా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కాగా బంగ్లాదేశ్‌లో ఫిబ్రవరి 12, 2026న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో హసీనా ప్రసంగం తీవ్ర దుమారం రేపుతోంది.


