
చెరుకు తింటూ పట్టుబడి.. స్తంభం వెనుక దాక్కుని..
థాయ్‌లాండ్‌లో ఏనుగు పిల్ల అమాయకత్వం
పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ తననెవరూ చూడటం లేదనుకుంటుందట. అలాంటి అమాయకత్వమే ఈ ఏనుగు పిల్లది. రాత్రిపూట ఓ చేలో చొరబడిన బుజ్జి ఏనుగు చెరుకు తింటూ ఉండిపోయింది. అంతలోనే ఎవరో వస్తున్నట్టు అలికిడి వినపడటంతో దాక్కోవాలనుకుంది. అదెదో పొదల్లోనో, చెట్టుమాటునో కాదు. దానికి సమీపంలో విద్యుత్ స్తంభం కనిపించింది. వెంటనే వెళ్లి దాని వెనుక దాక్కుంది. అంతేకాదు.. ఇక తానెవరికీ కనబడనని అనుకుంది.
దాక్కునేందుకు జంబో కిడ్ చేసిన విఫల ప్రయత్నం వాహనంలో ఉన్నవారికి నవ్వు తెప్పించింది. వెంటనే క్లిక్ మనిపించి.. ఆ చిత్రాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. జరిగిన విషయాన్నంతా జోడించారు. ఆ పిల్ల ఏనుగు అమాయక చర్య ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఫొటో చూసినవారు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతున్నారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో జరిగింది.
థాయ్‌లాండ్‌లో కనిపించిన ఈ ఏనుగు భారతీయ సంతతికి చెందింది. ఆసియా ఏనుగుల ఉపజాతి. వాటికున్న చిన్న చెవులే.. ఆఫ్రికన్ ఏనుగుల నుంచి వీటిని వేరుగా చూపిస్తాయి. ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో 4,422 అడవి ఏనుగులు ఉన్నాయని అంచనా. వాటిలో సగం ఐదు అటవీ ప్రాంతాలలో నివసిస్తున్నాయి.
ఇటీవల కాలంలో వాటి జనాభా పెరగడం, అటవీ ప్రాంతాలు తరుగుతుండటంతో ప్రమాదకరంగా మారింది. గత సంవత్సరం, ఏనుగులకు సంబంధించిన 4,700 ప్రమాద సంఘటనలు నమోదయ్యాయి. వాటి కారణంగా 19 మంది మరణించారు. 22 మంది గాయపడ్డారు. వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయని 594, ఆస్తి నష్టం కలిగించాయని 67 కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఏనుగులను చంపడం కఠినమైన నేరం.
– సాక్షి, నేషనల్ డెస్క్