కేఫ్‌ను లాంచ్‌ చేసిన పాక్‌ 'వైరల్‌' చాయ్‌వాలా!

Arshad Khan launched his own cafe - Sakshi

ఇస్లామాబాద్‌: ఒక్కఫొటోతో రాత్రికిరాత్రే స్టార్‌గా మారిన నీలి కళ్ల 'చాయ్‌వాలా' అర్షద్‌ ఖాన్‌ గుర్తున్నాడా? పాకిస్తాన్‌లో దాదాపు నాలుగేళ్ల క్రితం జియా అనే ఫొటోగ్రాఫర్‌ తీసిన ఓ ఫొటో సోషల్‌ మీడియాలో క్రేజీగా వైరల్‌ అవడంతో అర్షద్‌ ఏకంగా మోడల్‌గా మారిపోయాడు. 'చాయ్‌వాలా ఆఫ్‌ పాకిస్తాన్‌‌'గా విపరీతమైన పాపులారిటీతోపాటు డబ్బు సంపాదించాడు. ఇప్పుడు సొంతంగా ఇస్లామాబాద్‌లో ఓ అధునాతన కేఫ్‌ను ప్రారంభించాడు.

ఓ చిన్న దుకాణంలో టీ కాచుకునే అర్షద్‌ నాలుగేళ్లు గిర్రున తిరిగేసరికి ఓ భారీ కేఫ్‌కు యజమానిగా మారిపోయాడు. 'కేఫ్‌ చాయ్‌వాలా రూఫ్ టాప్‌' పేరుతో ప్రారంభించిన ఈ కేఫ్‌ గురించి అర్షద్‌ ఖాన్‌ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. 'కేఫ్‌ పేరులోని చాయ్‌వాలా అనే పదాన్ని తొలగిస్తే మేలని చాలా మంది సలహాలిచ్చారు. కానీ నేను ఎవరి మాటా వినలేదు. ఆ చాయ్‌వాలా అనే పదమే నాకు ఇంతటి గుర్తింపును తీసుకొచ్చింది' అని అర్షద్‌ చెప్పాడు. 

కేఫ్‌ పేరు మోడర్న్‌గా ఉన్నా లోపల ఇంటీరియర్స్‌ను మాత్రం సంప్రదాయం ఉట్టిపడేలా తీర్చిదిద్దామని ఆయన తెలిపాడు. వివిధ వెరైటీల కాఫీ, టీలతోపాటు 20 రకాల డిషెస్‌ తమ హోటల్‌లో లభిస్తాయని చెప్పాడు. కేఫ్‌ను ప్రారంభించినప్పటి నుంచి అర్షద్‌ఖాన్‌ను నెటిజన్లు తెగ పొగిడేస్తున్నారు. అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడని, లుక్స్‌తోపాటు మాటతీరులోనూ పరిణితి సాధించాడని ప్రశంసిస్తున్నారు. (చదవండి: పాక్‌ పావురాన్ని విడిచి పెట్టిన భారత్‌)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top