నీటి చుక్క దొరక్క 49 మంది మృతి | Another Sahara Desert Tragedy Niger People Died Latest News Updates | Sakshi
Sakshi News home page

నీటి చుక్క దొరక్క 49 మంది మృతి

Jun 6 2026 7:28 AM | Updated on Jun 6 2026 11:57 AM

Another Sahara Desert Tragedy Niger People Died Latest News Updates

ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వాతావరణం ఉన్న ప్రాంతాల్లో ఒకటైన సహారా ఎడారిలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ ట్రక్కు ఎడారిలో చిక్కుకుపోగా.. రోజుల తరబడి నీటి చుక్క దొరక్క 49 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇద్దరు కాలినడకన సాహసోపేత ప్రయాణం చేసి అధికారులకు విషయం చేరవేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది..

అల్జీరియా-మాలీ సరిహద్దుల్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. మాలీ నుంచి కొందరు పశ్చిమ ఆఫ్రికా దేశం నైజర్‌లో ఉన్న తమ కుటుంబ సభ్యులతో ఈద్ అల్-అధా(బక్రీద్‌)ను జరుపుకునేందుకు ట్రక్కులో బయల్దేరారు. అయితే ట్రక్కు అస్సామాకా పట్టణానికి పశ్చిమాన సుమారు 80 కిలోమీటర్ల దూరంలో.. సహారా ఎడారిలోని నిర్జన ప్రాంతంలో నిలిచిపోయింది.  ట్రక్కు చెడిపోవడంతో డ్రైవర్‌, సహాయకులు, ప్రయాణికులు కలిసి మరమ్మతు చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చుట్టుపక్కల ఎక్కడా గ్రామం లేదు.. నీటి వనరు లేదు.. ఫోన్ సిగ్నల్ కూడా లేదు. దీంతో వాహనంలో ఉన్నవారు మండే ఎండలో చిక్కుకుపోయారు.

సహారా ఎడారిలో వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు 45 నుంచి 50 డిగ్రీల సెల్సియస్‌ వరకు చేరుతుంటాయి. అలాంటి పరిస్థితుల్లో నీరు లేకపోతే మనిషి కొన్ని రోజులు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. ఆ ప్రయాణికులు సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. మొదట నీటి నిల్వలు అయిపోయాయి. తర్వాత ఆహారం కూడా ముగిసింది. చివరకు దాహం, వేడి, అలసటతో ఒక్కొక్కరిగా కుప్పకూలిపోయారు.

అయితే అందరూ చనిపోలేదు. ఇద్దరు వ్యక్తులు ప్రాణాల కోసం సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. 50 కిలోమీటర్లకుపైగా కాలినడకన ఎడారిలో నడిచి ఒక నీటి వనరును చేరుకున్నారు. అక్కడి నుంచి అస్సామాకా పట్టణానికి చేరుకుని అధికారులకు సమాచారం అందించారు. వారి సమాచారంతోనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. రక్షక బృందాలు అక్కడికి చేరుకునే సరికి ట్రక్కు కింద, చుట్టుపక్కల డజన్ల కొద్దీ మృతదేహాలు కనిపించాయి. మొత్తం 49 మంది చనిపోయినట్లు అధికారులు వెల్లడించారు.

రక్షక బృందాలకు మరో షాక్
ఈ ఘటనలో మృతదేహాలను వెలికితీసి.. ఎడారిలోనే సామూహిక ఖననాలు నిర్వహించారు. అయితే రక్షక బృందాలు తిరుగు ప్రయాణంలో మరో షాకింగ్‌ దృశ్యాన్ని చూశాయి. సమీప ప్రాంతంలో మరో ట్రక్కు కూడా చెడిపోయి సుమారు 60 మంది మూడు రోజులుగా చిక్కుకుపోయినట్లు గుర్తించారు. అదృష్టవశాత్తూ వారికి సమయానికి నీరు అందించి ప్రాణాలు కాపాడగలిగారు. లేదంటే మరో భారీ విషాదం జరిగేదని అధికారులు చెబుతున్నారు.


సహారా ఎందుకు ఇంత ప్రమాదకరం?
సహారా ఎడారి ప్రపంచంలోనే అతిపెద్ద వేడి ఎడారి. ఇది సుమారు 90 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉంటుంది. నైజర్‌లోని ఉత్తర ప్రాంతాల్లో జనావాసాలు చాలా తక్కువ. వందల కిలోమీటర్ల మేర నీటి వనరులు కనిపించవు. ఒక వాహనం చెడిపోతే సహాయం చేరుకోవడానికి రోజులు పట్టే పరిస్థితి ఉంటుంది. అందుకే స్థానికులు సహారాను "సైలెంట్‌ కిల్లర్‌"గా అభివర్ణిస్తుంటారు. అలా.. కుటుంబాలతో ఈద్‌ చేసుకునేందుకు బయల్దేరిన 49 మంది ప్రయాణికుల ప్రయాణం... చివరకు ఇసుకల్లోనే ముగిసింది.  సహారా ఎడారి మరోసారి తన క్రూర రూపాన్ని ప్రపంచానికి చూపించింది.

ఇది మొదటిసారి కాదు
సహారా ఎడారిలో ఇలాంటి విషాదాలు గతంలో కూడా ఎన్నోసార్లు జరిగాయి. 2013లో నైజర్ నుంచి అల్జీరియా వెళ్లేందుకు ప్రయత్నించిన పలువురు వలసదారులు దారి తప్పి దాహంతో మరణించారు. వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. 2017లో మరో ఘోర ఘటన జరిగింది. ఎడారిలో చిక్కుకున్న వలసదారుల్లో 44 మంది దాహం, ఆకలితో మృతి చెందారు. ఆ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

అంతర్జాతీయ వలస సంస్థ (IOM) అంచనా ప్రకారం 2014 నుంచి సహారా మార్గాల్లో కనీసం 7 వేల మందికిపైగా మరణించినట్లు.. మరికొందరు అదృశ్యమైనట్లు నమోదైంది. వాస్తవ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎడారిలో కనిపించకుండా పోయిన వారిలో చాలామంది గురించి ఎప్పటికీ సమాచారం బయటకు రాదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement