Afghanistan: 20 ఏళ్ల తర్వాత స్వదేశానికి.. ఎవరీ అబ్దుల్‌ ఘనీ?!

Afghanistan: Who Is Abdul Ghani Baradar Returns After 20 Years - Sakshi

కాబూల్‌: అఫ్గనిస్తాన్‌ను ఆధీనంలోకి తీసుకున్న తాలిబన్లు ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పావులు కదుపుతున్నారు. ఓవైపు అఫ్గన్‌ ప్రజల నిరసన జ్వాలలు కొనసాగుతున్నప్పటికీ లెక్కచేయక అధికారం చేపట్టేందుకు తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇక తాలిబన్లు అఫ్గన్‌ను హస్తగతం చేసుకున్న వెంటనే అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీ దేశం విడిచి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాలిబన్‌ సహ వ్యవస్థాపకుడు అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ అఫ్గనిస్తాన్‌కు కాబోయే తదుపరి అధ్యక్షుడు అనే వార్తలు వెలువడుతున్నాయి.

2001లో తాలిబన్‌ నాయకత్వం నుంచి తొలగించబడి, దేశం విడిచి వెళ్లిపోయిన అబ్దుల్‌ మళ్లీ మంగళవారం కాందహార్‌లో అడుగుపెట్టారు. ఒకప్పుడు తాలిబన్‌ లీడర్‌గా ఓ వెలుగు వెలిగిన అబ్దుల్‌ ఎందుకు అఫ్గన్‌ను వీడాల్సి వచ్చింది?  పాకిస్తాన్‌లో అరెస్టై, సుమారు 8 ఏళ్ల పాటు నిర్బంధ జీవితం గడిపిన ఆయన ఎవరి చొరవతో బయటపడ్డారు? వంటి ఆసక్తికర వివరాలు మీకోసం..

అఫ్గనిస్తాన్‌లోని ఉరుజ్‌గాన్‌ ప్రావిన్స్‌లో 1968లో అబ్దుల్‌ ఘనీ బరాదర్‌ జన్మించారు. 1980లో సోవియట్‌ సేనలకు వ్యతిరేకంగా అఫ్గన్‌ ముజాహిదీన్‌ తరఫున పోరాడారు.

1989లో సోవియట్‌ సేనలు దేశాన్ని వీడిన తర్వాత మహ్మద్‌ ఒమర్‌తో కలిసి కాందహార్‌లో మదర్సాను స్థాపించిన అబ్దుల్‌ ఘనీ.. 1994లో తాలిబన్‌ ఉద్యమాన్ని లేవనెత్తారు. ఈ క్రమంలో 1996లో తాలిబన్‌ అధికారం చేపట్టింది. కాగా తాలిబన్‌ ఉద్యమ సహచరులుగా ఉన్న అబ్దుల్‌- ఒమర్‌ ఆ తర్వాత బంధువులుగా మారారు. ఒమర్‌ సోదరిని అబ్దుల్‌ పెళ్లి చేసుకున్నారు.

తాలిబన్‌ పాలనలో రక్షణ శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన అబ్దుల్‌.. న్యూయార్క్‌ ట్విన్‌ టవర్స్‌ కూల్చివేత తర్వాత అఫ్గన్‌ పరిస్థితులపై అమెరికా జోక్యంతో దేశం నుంచి బహిష్కరణకు గురయ్యారు. కాగా అప్పటి తాలిబన్ల ప్రభుత్వాన్ని కేవలం పాకిస్తాన్‌, సౌదీ అరేబియా, యూఏఈ మాత్రమే గుర్తించిన విషయం తెలిసిందే.

అయితే అనూహ్య పరిణామాల నేపథ్యంలో 2010లో పాకిస్తాన్‌లోని కరాచీలో అబ్దుల్‌ అరెస్టయ్యారు. అనంతరం ఆయనను దోహా(ఖతార్‌)కు తరలించారు.  

ఖతార్‌లో ఉన్న సమయంలో అబ్దుల్‌ అమెరికా, అఫ్గన్‌ శాంతిదూతలతో చర్చల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అమెరికా తరఫున ఆ సమావేశాలకు హాజరైన జల్‌మే ఖలిజాద్‌ అబ్దుల్‌ నమ్మదగ్గ వ్యక్తి అని, అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై కృషి చేస్తున్నారని ట్రంప్‌ ప్రభుత్వానికి తెలిపారు. ఈ నేపథ్యంలో 2018లో నిర్బంధ జీవితం నుంచి అబ్దుల్‌కు విముక్తి లభించింది.

ఈ క్రమంలో 2020లో అమెరికాతో తాలిబన్లకు కుదిరిన చారిత్రాత్మక దోహా ఒప్పందంపై అబ్దుల్‌ సంతకం చేశారు. ఈ సందర్భంగా అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. అఫ్గనిస్తాన్‌లో శాంతి స్థాపనకై అబ్దుల్‌తో ప్రత్యేకంగా చర్చలు జరిపారు.

అదే విధంగా.. తాలిబన్లను అఫ్గన్‌ సైన్యంగా, రాజకీయ శక్తిగా గుర్తించిన చైనా ఆహ్వానం మేరకు తొమ్మిది మంది తాలిబన్‌ నేతల బృందంతో కలిసి అబ్దుల్‌ 2021లో డ్రాగన్‌ దేశంతో చర్చలు జరిపారు.

ఇక అమెరికా సేనల ఉపసంహరణ తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ తాలిబన్లు ఆదివారం అఫ్గన్‌ను ఆధీనంలోకి తీసుకున్న నేపథ్యంలో అబ్దుల్‌ వారిని ఉద్దేశించి ప్రత్యేక సందేశం విడుదల చేశారు. ‘‘తాలిబన్‌ ఫైటర్లూ.. మున్ముందు అసలైన సవాళ్లు ఎదురుకాబోతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. సాధించాల్సి ఎంతో ఉంది’’ అని పేర్కొన్నారు.

అంతేగాక, ఆదివారమే ఖతార్‌ నుంచి అఫ్గన్‌ చేరుకున్న అబ్దుల్‌.. అధ్యక్షుడు అష్రఫ్‌ ఘనీతో చర్చలు జరిపినట్లు వార్తలు వినిపించాయి. అయితే, తాలిబన్‌ ప్రతినిధులు మాత్రం ఈ విషయాన్ని కొట్టిపడేశారు. ఆ సమయంలో అబ్దుల్‌ ఖతార్‌లోనే ఉన్నారని స్పష్టం చేశారు.  

-వెబ్‌డెస్క్‌

చదవండి: Afghanistan: జెండా ఎగరేసిన నిరసనకారులు, కాల్పుల మోత
Afghanistan: ప్రభుత్వ ఏర్పాటు దిశగా తాలిబన్లు.. కీలక భేటీ!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top