
ఇజ్రాయెల్‌లోని గుహలో వెలుగులోకి...
ఇజ్రాయెల్‌లో ఏకంగా లక్ష ఏళ్ల నాటి అతి పురాతన సమాధుల సమూహం వెలుగు చూసింది. దీన్ని ప్రపంచంలోనే అత్యంత ప్రాచీన శవాల దిబ్బల్లో ఒకటిగా భావిస్తున్నారు. నాటి ఆదిమ మానవుల మృతదేహాలను ఇక్కడ గుంతల్లో జాగ్రత్తగా సమాధి చేసినట్టు కనుగొన్నారు. సెంట్రల్ ఇజ్రాయెల్‌లోని టిన్ష్‌మెట్ గుహలోని ఈ సమాధుల సమూహానికి గురించిన వివరాలను ఇటీవలే అకాడమిక్ జర్నల్‌లో ప్రచురించారు.
చనిపోయిన వారి గౌరవార్థం మృతదేహాల పక్కన పాతిపెట్టిన పలు వస్తువులు, అవశేషా లను అక్కడినుంచి తవ్వితీశారు. ఇది మానవ జాతికి సంబంధించి వెలుగు చూసిన అతి గొప్ప ఆవిష్కరణ అని తవ్వకాల బృందం డైరెక్టర్లలో ఒకరు, హీబ్రూ యూనివర్సిటీ ఆర్కియాలజీ ప్రొఫెసర్ యోసి జైద్నెర్ అన్నారు. ఈ దిబ్బల్లో మృతదేహాలను గర్భస్థ పిండం ఆకృతిలో పాతిపెట్టారు. ఇవి లక్ష నుంచి లక్షా 10 వేల ఏళ్ల నాటివని వివరించారు.
గుహ మొదట్లోనే పుర్రె
టిన్ష్‌మెట్ ప్రాంతంలో పురాతత్వ శాస్త్రవేత్తలు 2016 నుంచీ తవ్వకాలు సాగిస్తున్నారు. గుహ మొదట్లో రాతి గుండా బయటికి చొచ్చుకుని వచ్చినట్టుగా ఉన్న ఓ పుర్రెను గుర్తించారు. లోపల సమాధుల్లో శవాల పక్కన గులకరాళ్లు, జంతువుల అవశేషాల వంటివి కనిపించాయి. వీటిలో చాలావరకు నాటి రోజువారీ జీవితంలో ఉపయోగం లేనివే. దాంతో ఇవి అప్పటి ఆచారం ప్రకారం మృతుల గౌరవార్థం ఉంచినవేనని తేల్చారు.
ఇవన్నీ రాతియుగం నాటివిగా, అంటే సుమారు 2.5 లక్షల నుంచి 30 వేల ఏళ్ల మధ్యనాటివిగా తేలింది. ఈ వివరాలను నేచర్‌హ్యూమన్ బిహేవియర్ జర్నల్‌లో ప్రచురించారు. ఇక్కడ రెండు అస్థిపంజరంతో కూడిన పూర్తిస్థాయి పుర్రెలు, మూడు పుర్రెలు, ఎముకలతో పాటు అలంకరణ సామగ్రి వంటివి కూడా దొరికాయి. అప్పట్లోనే మనిషి కేవలం తిండి, స్వీయరక్షణకు పరిమితం కాకుండా ఇతరత్రా అంశాలను కూడా నేర్చుకున్నట్టు దీన్నిబట్టి తెలుస్తోందని పురాతత్వవేత్తలు అభిప్రాయç ³డుతున్నారు.
సున్నితత్వం దృష్ట్యా ఈ గుహ భాగాలను అతి చిన్న పరికరాలతో జాగ్రత్తగా తొలుస్తున్నారు. ఈ నేపథ్యంలో అందులోని పూర్తి విశేషాలు బయట పడాలంటే మరికొన్నేళ్లు పడుతుందని భావిస్తున్నారు. ఇవి ఇజ్రా యెల్‌లోని 100 ఏళ్ల క్రితం స్కుల్‌లో, 50 ఏళ్ల నాడు ఖఫ్జేలో బయటపడ్డ గుహలను తలపిస్తు న్నాయి. మృతదేహాలను గాలికి వదిలేయకుండా ఇలా ఒక పద్ధతి ప్రకారం అంత్యక్రియలు జరిపే ఆచారం బహుశా 2 లక్షల ఏళ్ల క్రితమే పురుడుపోసుకుని ఉంటుందని పురాతత్వవేత్తలు అంచనా వేస్తున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్