ఐపీఎల్ టికెట్ల విక్రయం పేరుతో టోకరా
సాక్షి, సిటీబ్యూరో: ఉప్పల్ స్టేడియం వేదికగా ఈ నెల 22న జరగనున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య పోరుకు ఉన్న విపరీతమైన క్రేజ్‌ను సైబర్ కేటుగాళ్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారని కొత్వాల్ వీసీ సజ్జనర్ శనివారం పేర్కొన్నారు. ఆ మ్యాచ్ టికెట్ల కోసం అభిమానుల్లో ఉన్న డిమాండ్‌ను ఆసరాగా చేసుకుని, నకిలీ యాప్‌లు, వెబ్‌సైట్ల ద్వారా దోపిడీకి తెరలేపారని అప్రమత్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ టికెట్ల బుకింగ్‌కు సంబంధించి అనేక ప్రకటనలు దర్శనమిస్తున్నాయని, అధికారిక టికెటింగ్ భాగస్వామి అయిన ’డిస్ట్రిక్ట్’ యాప్‌ను పోలిన రంగులు, లోగోలతో ఉన్న నకిలీ యాప్‌లను సృష్టించి, తక్కువ ధరకే టికెట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నారని సజ్జనర్ తెలిపారు. అచ్చం అసలు యాప్‌ను తలపించేలా ఉన్న ఈ నకిలీ లింకులను క్లిక్ చేసి టికెట్లు బుక్ చేసుకుంటే, మీ సొమ్ము గల్లంతవ్వడం ఖాయమని అన్నారు. ఇలాంటి ఫేక్ యాప్‌లు, వెబ్ సైట్స్‌పై నిఘా ఉంచామని, ఎవరైనా ఇటువంటి ఫేక్ యాప్స్ లేదా వెబ్‌సైట్ల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.


