● మాజీ ఐపీఎస్ భార్య హత్య కేసులో ముంబయిలో పట్టివేత
● చోరీ ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్ కూడా..!
బంజారాహిల్స్: విశ్రాంత ఐపీఎస్ వినయ్‌రంజన్ భార్య తనూజ రంజన్‌ను జూబ్లీహిల్స్ ప్రశాసన్‌నగర్‌లో నేపాలీ పని మనిషి కల్పన, మరో ముగ్గురు నేపాలీలు దారుణంగా హత్య చేసిన ఉదంతం దర్యాప్తులో నగర పోలీసులు కొంత పురోగతి సాధించారు. కీలక నిందితుడు సునీల్ పరియర్‌తో పాటు ఆభరణాలు కొనుగోలు చేసిన రిసీవర్‌ను ముంబైలో అదుపులోకి తీసుకుని నగరానికి తరలించారు. దోపిడీలో పాల్గొన్న మిగతా ముగ్గురు కల్పన అలియాస్ ధర్మ, సురేష్‌షాహి, గణేష్‌షాహి కోసం ముంబైలో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఘటనలో మొత్తం ఏడుగురు పాల్గొన్నట్లు అనుమానిస్తున్నారు. తనూజను ఈ నెల 8న నలుగురు నేపాలీలు హత్య చేసి తెల్లవారుజామున 3.30కు నాంపల్లిలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. పోలీసుల కళ్లుగప్పేందుకు చర్లపల్లిలో దిగి కారు బుక్ చేసుకుని నగర శివార్ల వరకు వెళ్లారు. కాగా, కల్పన, సురేష్, గణేష్‌ల వద్ద ఫోన్ లేకపోవడంతో పట్టుకోవడంలో జాప్యమవుతోంది. సునీల్ ద్వారా వీరి జాడ కోసం సాంకేతికతను వినియోగించి జల్లెడ పడుతున్నారు. గ్యాంగ్‌లో ఒకరు దొరకడంతో దర్యాప్తు కొంత సులువైంది. కల్పన, సునీల్, సురేష్, గణేష్‌లు తనూజను హత్య చేసి 22 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. చోరీ సొత్తు కల్పన దగ్గరే ఉండడంతో ఆమెను పట్టుకుంటే మొత్తం మిస్టరీ వీడనుంది. కాగా, ప్రశాసన్‌నగర్ ఘటనలో ఒకరు పట్టుబడడం పోలీసులకు కొంత ఊరటనిచ్చింది. వీరి ద్వారా నగరంలో తిష్టవేసిన నేపాలీ గ్యాంగ్‌ను పట్టుకోవాలని పోలీసులు భావిస్తున్నారు.


