వరదలకు అడ్డుకట్ట | - | Sakshi
Sakshi News home page

వరదలకు అడ్డుకట్ట

May 15 2026 12:25 PM | Updated on May 15 2026 12:25 PM

టీసీయూఆర్‌ కోసం భారీ స్టామ్‌ వాటర్‌ డ్రైన్‌ సాక్షి, సిటీబ్యూరో

ప్రతి వర్షాకాలంలో ముంచెత్తుతున్న వరద సమస్యలకు శాశ్వత పరిష్కారానికి జీహెచ్‌ఎంసీ కీలక అడుగు వేసింది. జీహెచ్‌ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీలు విస్తరించిన తెలంగాణ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ టీసీయూఆర్‌) వరకు సమగ్ర, సమన్వయ స్టామ్‌ వాటర్‌ డ్రైన్‌ మాస్టర్‌ప్లాన్‌ కోసం ఆర్‌ఎఫ్‌పీ టెండర్లు ఆహ్వానించినట్లు సంబంధిత అధికారి తెలిపారు. జీహెచ్‌ఎంసీతోపాటు శివార్లలో అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్ని, 2047 నాటికి రూపాంతరం చెందనున్న నగరాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ మాస్టర్‌ప్లాన్‌కు సిద్ధమైంది.

జీఐఎస్‌, 2డీ మోడలింగ్‌తో..

ఈ మాస్టర్‌ప్లాన్‌లో అత్యాధునిక సాంకేతికతను వినియోగించనున్నారు. జీఐఎస్‌ ఆధారిత మ్యాపింగ్‌, హైడ్రాలజికల్‌, హైడ్రోడైనమిక్‌ 1డీ–2డీ మోడలింగ్‌ ద్వారా నగరంలోని ప్రధాన, ఉప, చిన్న డ్రైనేజీ వ్యవస్థలను కూడా విశ్లేషించనున్నారు. వరదల తీవ్రత, నీటి ప్రవాహ దిశలు, నీటిమునిగే ప్రాంతాలు, డ్రైనేజీ సామర్థ్యం తదితర అంశాలను కంప్యూటర్‌ మోడళ్ల ద్వారా అంచనా వేయనున్నారు.

ఆక్రమణలపై దృష్టి

నగరంలోని చెరువులు, నాలాలు, వాగులు, రోడ్ల పక్కన ఉన్న డ్రైన్లు, కల్వర్టులు, బ్రిడ్జిల పరిస్థితిని పూర్తిస్థాయిలో సర్వే చేయనున్నారు. నాలాలపై ఆక్రమణలు, పేరుకుపోతున్న చెత్త, మురుగునీరు కలుస్తుండటం, కాలుష్యం వంటి సమస్యలను కూడా గుర్తించి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. చెరువుల సరిహద్దులు, ఫుల్‌ట్యాంక్‌ లెవెల్‌ (ఎఫ్‌టీఎల్‌), నీటి నిల్వ సామర్థ్యం, బండ్‌ల స్థితి, సిల్టింగ్‌ పరిస్థితులను అధ్యయనం చేయనున్నారు.

రియల్‌టైమ్‌ మానిటరింగ్‌

నగరంలో వరద ముప్పు ప్రాంతాల్లో రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా ఇందులో ఉంది. నీటి మట్టం, వర్షపాతం, నీటి ప్రవాహాలను గుర్తించే ఐఓటీ సెన్సర్లు, డాప్లర్‌ రాడార్‌ వ్యవస్థలు, జీఐఎస్‌ డ్యాష్‌బోర్డులు, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను రూపొందించనున్నారు. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్లతో అనుసంధానం చేసి అత్యవసర పరిస్థితుల్లో వేగంగా స్పందించేలా ఈ వ్యవస్థ పని చేయనుంది. ఈ నేపథ్యంలో ఆధునిక సాంకేతికతతో, రియల్‌టైమ్‌ మానిటరింగ్‌ వ్యవస్థతో, మూడు కార్పొరేషన్లను దృష్టిలో ఉంచుకొని తాజాగా టెండర్లు పిలిచినట్లు అధికారులు పేర్కొన్నారు.

వరద నీటి ప్రవాహ దారి

భూగర్భ మౌలిక వసతి

రెండేళ్లలో పనులు పూర్తయ్యేలా మాస్టర్‌ ప్లాన్‌

రియల్‌ టైమ్‌ పర్యవేక్షణతో వరద హెచ్చరికలు

టెండర్లు పిలిచిన జీహెచ్‌ఎంసీ

నిర్వహణ వ్యవస్థకు ప్రత్యేక ప్రణాళిక

స్టామ్‌ వాటర్‌ డ్రైన్ల నిర్వహణ కోసం ప్రత్యేక ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించనున్నారు. ప్రతి నాలాకు డీసిల్టింగ్‌ షెడ్యూల్‌, జీఐఎస్‌ ఆధారిత మానిటరింగ్‌, శాఖలవారీ బాధ్యతలు, అత్యవసర స్పందన విధానాలు సిద్ధం చేయనున్నారు. రోబోటిక్‌, యాంత్రిక పద్ధతుల్లో నాలాల శుభ్రతకు అవసరమైన యంత్ర సామగ్రి వినియోగంపై కూడా అధ్యయనం చేయనున్నారు.

ఈ పనులన్నీ పూర్తయ్యేందుకు దాదాపు రెండేళ్లు పడుతుందని అధికారులు పేర్కొన్నారు. నగరంలో భవిష్యత్‌ వరద ముప్పును తగ్గించడమే కాకుండా, సమగ్ర పట్టణ ప్రణాళిక, నీటి వనరుల పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి సైతం ఉపయోగపడేలా ఈ మాస్టర్‌ప్లాన్‌ ఉంటుందని చెబుతున్నారు. టెండర్ల దాఖలుకు చివరి తేదీ ఈ నెల 26.

Advertisement
 
Advertisement
Advertisement