ఇద్దరు కాదు ఐదుగురు! | - | Sakshi
Sakshi News home page

ఇద్దరు కాదు ఐదుగురు!

Dec 12 2025 5:46 PM | Updated on Dec 12 2025 5:46 PM

ఇద్దరు కాదు ఐదుగురు!

ఇద్దరు కాదు ఐదుగురు!

సాక్షి, సిటీబ్యూరో: నగరానికి చెందిన ప్రముఖ వైద్యుడిగా ఉన్న డాక్టర్‌ పి.వినయ్‌కుమార్‌ తదితరులను రూ.23.1 కోట్ల మేర మోసం చేసి, టాస్క్‌ఫోర్స్‌ కస్టడీ నుంచి ఎస్కేప్‌ అయినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉప్పలపాటి సతీష్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో తొలుత సతీష్‌తో పాటు ఆయన భార్య శిల్ప బొండ మాత్రమే నిందితులుగా ఉన్నారు. అయితే వీరి అరెస్టు తర్వాత వెలుగులోకి వచ్చిన పరిణామాలతో మరో ముగ్గురినీ ఆ జాబితాలో చేరుస్తూ సీసీఎస్‌ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సతీష్‌ సోదరిలతో పాటు బావను నిందితులుగా చేరుస్తున్నట్లు సీసీఎస్‌ అధికారులు నాంపల్లి కోర్టుకు సమాచారం ఇచ్చారు. వీరిలో సతీష్‌, శిల్పలతో పాటు హిమబిందులను ఇప్పటికే అరెస్టు చేసిన సీసీఎస్‌ అధికారులు త్వరలో మరికొందరి పైనా చర్యలకు సన్నాహాలు చేస్తున్నారు.

పథకం ప్రకారం

షెల్‌ కంపెనీలు ఏర్పాటు...

సతీష్‌ 2018లో పృథ్వీ ఇన్ఫర్మేషన్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, ఆ తర్వాత మూసేశాడు. సతీష్‌ తన సోదరి హిమబిందు, భార్య శిల్ప, స్నేహితుడు పువ్వల ప్రసేన్‌ కుమార్‌తో కలిసి భారీ స్కామ్‌కు కుట్ర పన్నారు. దీన్ని అమలులో పెట్టడంలో భాగంగా అనేక షెల్‌ కంపెనీలను తెరిచారు. 2019లో సతీష్‌, శిల్ప, ప్రసేన్‌కుమార్‌ పథకం ప్రకారం డాక్టర్‌ వినయ్‌కుమార్‌ను కలిసి తమ సంస్థల్లో పెట్టుబడులు పెట్టాలని, కచ్చితంగా భారీ లాభాలు పంచుతామని చెప్పారు.

నమ్మడంతో నట్టేట ముంచేసి...

ఈ విషయం నమ్మిన వైద్యుడితో పాటు మరో ముగ్గురు ఆయన కుటుంబీకులకూ కలిపి విజయ్‌ శ్రావ్య ఇన్‌ఫ్రా అండ్‌ డెవలపర్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడానికి సిద్ధమయ్యారు.వారు రూ.15.21 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ సంస్థలో వీరితో పాటు మరో ఇద్దరూ రూ.6.5 కోట్లు, రూ.1.39 కోట్లు చొప్పున ఇన్వెస్ట్‌ చేశారు. ఇలా ఈ బాధితుల నుంచి ప్రసేన్‌, శిల్పలు రూ.23.1 లక్షలు పెట్టుబడులు పెట్టించారు. బాధితుడితో పాటు ఆయన కుటుంబీకులకు ప్రసేన్‌, శిల్పలు 2023 జనవరి వరకు లాభాలు పంచారు. ఆపై ఎలాంటి సమాచారం లేకుండా ఆపేయడంతో వీరికి సందేహం వచ్చింది. ప్రసేన్‌ కుమార్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే సమాచారం బాధితుడికి అందింది. దీంతో ఆ ఏడాది ఏప్రిల్‌లో ఆయన్ను చూడటానికి బాధితుడు వెళ్లారు. ఆ సమయంలో ప్రసేన్‌ కుమార్‌ బాధితుడితో మాట్లాడుతూ శిల్ప బండతో పాటు సతీష్‌ ఉప్పలపాటి కొన్ని షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేశారని, పథకం ప్రకారం తమ పెట్టుబడులను వాటిలోకి మళ్లించారని చెప్పాడు.

సహకరించిన సోదరిలు, బావ...

ఎట్టకేలను తాను మోసపోయానని గుర్తించిన వినయ్‌ కుమార్‌ సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సతీష్‌, శిల్పలపై కేసు నమోదైంది. ఈ విషయం తెలిసిన శిల్ప, సతీష్‌ను అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన అధికారులు స్కామ్‌లో హిమబిందు పాత్రను గుర్తించారు. గత నెల 8న ఆమెను అరెస్టు చేశారు. సతీష్‌, శిల్ప తప్పించుకోవడానికి, న్యాయపోరాటానికి అవసరమైన అన్ని సహాయ సహకారాలూ మాధవితో పాటు బిందు భర్త భాగవతుల వెంకటరమణ అందించారు. కారు డ్రైవర్‌ శివానందంను బెదిరిస్తూ, అతడి ఫోన్‌ తమ ఆధీనంలో ఉంచుకుని సతీష్‌, శిల్పలు అనేక రాష్ట్రాల్లో తిరిగారు. చివరకు గత నెల 20న వీరి కదలికల్ని కర్ణాటకలో ఉన్న ధార్వాడలో గుర్తించిన సీసీఎస్‌ అధికారులు అరెస్టు చేసి తీసుకువచ్చారు. కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే వీరి ఎస్కేప్‌తో పాటు మోసాల్లోనూ మాధవి, వెంకట రమణ పాత్ర ఉన్నట్లు తేలింది. దీంతో వీరినీ నిందితులుగా చేరుస్తూ కోర్టుకు సమాచారం ఇచ్చారు.

అంతు చిక్కని ‘విషం’ మిస్టరీ..

ప్రసేన్‌ కుమార్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారనే సమాచారం తెలిసిన డాక్టర్‌ వినయ్‌కుమార్‌ 2023 ఏప్రిల్‌లో వెళ్లి ఆయన్ను కలిశారు. ఈ సందర్భంలోనే ప్రసేన్‌... సతీ ష్‌, శిల్పలు ఉద్దేశపూర్వకంగానే ఈ మోసానికి పాల్పడ్డారని, అంతేకాకుండా వాళ్లిద్దరే తనకు విషం పెట్టారని వివరించాడు. అదే నెల 24న ప్రసేన్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. అదే ఏడాది జూన్‌లో సతీష్‌ను కలిసిన వినయ్‌ కుమార్‌ తన డబ్బు విషయం ఆరా తీశారు. అప్పుడు నిధులను వివిధ షెల్‌ కంపెనీల్లోకి మళ్లించి, సొంతానికి వాడుకున్న విషయాన్ని సతీష్‌ అంగీకరించాడు. తన డబ్బు కోసం బాధితుడు ఒత్తిడి తీసుకురాగా.... చట్టపరంగా ముందుకు వెళ్లాలని చూస్తే ప్రసేన్‌కు పట్టిన గతే పడుతుంది బెదిరించాడు. ఈ అంశాలను సీసీఎస్‌ పోలీసులు తమ కేసులో ప్రస్తావించారు. సతీష్‌, శిల్పల వాంగ్మూలాల్లోనూ ప్రసేన్‌ విష ప్రయోగంతో చనిపోయారనే విషయం పొందుపరిచారు. ఆ విషం అతడికి ఇచ్చింది ఎవరు? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అనే అంశాలు మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నాయి.

శిల్ప, సతీష్‌ ( ఫైల్‌)

ఉప్పలపాటి సతీష్‌ కేసులో పెరిగిన నిందితులు

ఇప్పటికే సూత్రధారులు సహా ముగ్గురు అరెస్టు

వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిటీ సీసీఎస్‌

త్వరలో మరికొందరి పైనా చర్యలకు సన్నాహాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement