చలి వేళ.. మూగజీవాలకు వెచ్చగా!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో చలి విజృంభిస్తోంది. ఈ నేపథ్యంలో జంతువులకు వెచ్చదనం కలిగించేలా నగరంలోని నెహ్రూ జంతు ప్రదర్శనశాల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలి నుంచి జంతువులను రక్షించడానికి హీటర్లు, షేడ్ నెట్‌లు, చెక్క పలకలు, ఇన్సులేటెడ్ షెల్టర్‌లు, అత్యధిక వెలుగునిచ్చే బల్బులు ఏర్పాటు చేశారు. బయటి ఉష్ణోగ్రతల కంటే జూలో 3–5 డిగ్రీలు తక్కువగానే ఉంటుంది. ఇటీవల జూలో 10 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో గది హీటర్లు సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు పనిచేసేలా ఏర్పాటు చేశారు. కొన్ని ఎన్‌క్లోజర్ల చుట్టూ మందపాటి గోనెసంచులను చుట్టి వుంచారు. కొన్నింట్లో చెక్క పలకలపై జంతువులు విశ్రాంతి తీసుకునేలా చూస్తున్నారు.
నిత్యం వైద్యపరీక్షలు
చలి ప్రభావం నుంచి తట్టుకునేలా జంతువులు ఉండే ఎన్‌క్లోజర్ల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జూ డిప్యూటీ డైరెక్టర్ వెటర్నరీ మహ్మద్ అబ్దుల్ హకీం బుధవారం ‘సాక్షి’కి తెలిపారు. వ్యప్రాణులకు అందించే ఆహారం, పానీయాలలోనూ మార్పులు చేసినట్లు చెప్పారు. రెగ్యులర్‌గా వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నామన్నారు. నిమోనియా వంటి వ్యాధులు సోకకుండా బీ కాంప్లెక్స్, కాల్షియం మందులు ఇస్తున్నట్లు తెలపారు.
చలి వేళ.. మూగజీవాలకు వెచ్చగా!


