అపార్ట్‌మెంట్‌లో భారీ చోరీ
రూ. 70 లక్షల నగదు, నగలు మాయం
మలక్‌పేట: ఓ కుటుంబం విహార యాత్రకు వెళ్లి వచ్చేసరికి దొంగలు ఇంటి తాళాలు పలుగొట్టి లోపలికి చొరబడి ఇళ్లు గుల్ల చేశారు. అల్మారాలోని రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు, బంగారు అభరణాలు 15 తులాలు, 4 కిలోల వెండిని దోచుకెళ్లారు. ఈ సంఘటన మలక్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు..అక్బర్‌బాగ్ డివిజన్ ప్రొఫెసర్స్ కాలనీలోని మానస అపార్ట్‌మెంట్‌లో మంత్రవాది వెంకటరమణ కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.గతనెల 13న కుటుంబం విహార యాత్రకు వెళ్లి ఈనెల 10న రాత్రి తిరిగి వచ్చారు. ఇంట్లోకి వెళ్లిన తరువాత చోరీ జరిగినట్లు గమనించారు. వెనుకవైపు బాల్కనీ తలుపులు పగులగొట్టి ఉన్నాయి. బాధితుడు బీరువాలో చూడగా పగులగొట్టి ఉంది. అల్మారాలో ఉన్న రూ. 45 లక్షలు నగదు, బంగారు బిస్కెట్లు 10 తులాలు, బంగారు గాజులు 2 తులాలు, బంగారు నాణేలు 3 తులాలు, 4 కిలోల వెండి కన్పించలేదు. దీంతో మలక్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు క్లూస్ టీమ్‌ను రప్పించి వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు.
వాచ్‌మెన్‌పై అనుమానం..
నేపాల్‌కు చెందిన అర్జున్ ఐదు నెలలు అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేశాడు. భార్య నిర్మల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సోదరి ఇంటికి వెళ్తున్నామని చెప్పి భార్యభర్తలు కలిసి బయటికి వెళ్లారు. భార్య అక్కడే ఉండి పోయింది. ఆ తరువాత వచ్చిన అతను నవంబర్ 25 తేదిన వెళ్లిపోయాడు. ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుంది. నేపాల్‌కు వెళ్లిపోతున్నాని చెప్పి మరో వ్యక్తిని వాచ్‌మెన్‌గా కూడా పెట్టాడని అపార్ట్‌మెంట్ వాసులు పేర్కొంటున్నారు. అతడే దొంగతనానికి పాల్పడి ఉంటాడని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు.


