యాక్సిస్‌ బ్యాంక్‌కు రూ.11.74 కోట్లు టోకరా | - | Sakshi
Sakshi News home page

యాక్సిస్‌ బ్యాంక్‌కు రూ.11.74 కోట్లు టోకరా

Dec 8 2025 10:38 AM | Updated on Dec 8 2025 10:38 AM

యాక్సిస్‌ బ్యాంక్‌కు రూ.11.74 కోట్లు టోకరా

యాక్సిస్‌ బ్యాంక్‌కు రూ.11.74 కోట్లు టోకరా

రుణం తీసుకుని మళ్లించిన కేఎస్‌ఎస్‌పీఎల్‌ సంస్థ

సాక్షి, సిటీబ్యూరో: వ్యాపార విస్తరణ కోసమంటూ యాక్సిస్‌ బ్యాంక్‌ నుంచి టర్మ్‌ లోన్‌ తీసుకున్న కీర్తి శ్రీనివాస సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (కేఎస్‌ఎస్‌పీఎల్‌) సంస్థ అందులో భారీ మొత్తాన్ని దారి మళ్లించింది. ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ద్వారా ఈ విషయం గుర్తించిన బ్యాంకు అధికారులు నగర నేర పరిశోధన విభాగంలో (సీసీఎస్‌) ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా సదరు సంస్థతో పాటు డైరెక్టర్లుగా ఉన్న టి.బాలాజీ, పి.అనిల్‌ కుమార్‌లపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేఎస్‌ఎస్‌పీఎల్‌ సంస్థకు హైదరాబాద్‌లోని బేగంపేటలో కార్యాలయం ఉండగా... బెంగళూరులో మూడు రెస్టారెంట్లు ఉండేవి. యాక్సిస్‌ బ్యాంక్‌ ఈ సంస్థకు 2017లో రూ.14.15 కోట్ల టర్మ్‌ లోన్‌ మంజూరు చేసింది. ఇందులో కొంత మొత్తాన్ని ఆ సంస్థ చెల్లించినా... రూ.11.74 కోట్లు బకాయి పడింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కార్యాలయంతో పాటు రెస్టారెంట్లు మూతపడినప్పటికీ రుణానికి సంబంధించిన చెల్లింపులు కొనసాగాయి. ఏప్రిల్‌ 16 నుంచి కేఎస్‌ఎస్‌పీఎల్‌కు సంబంధించిన ఖాతా నాన్‌ పెర్ఫార్మింగ్‌ అసెట్‌ జాబితాలోకి వెళ్లిపోయింది. దీంతో యాక్సస్‌ బ్యాంక్‌ ఈ సంస్థ లావాదేవీలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ చేయించింది. ఈ నేపథ్యంలోనే కేఎస్‌ఎస్‌పీఎల్‌ సంస్థ ఎస్‌ఎస్‌ఎస్‌ ఇంజినీరింగ్‌ ప్రాజెక్ట్స్‌, శ్రీ రాధే ట్రేడర్స్‌తో లావాదేవీలు జరిపినట్లు నకిలీ ఆధారాలు చూపినట్లు తేలింది. ఆ లావాదేవీల్లో భాగంగా ఈ రెండు సంస్థలకు చెందిన ఖాతాల్లోకి బదిలీ చేసిన రూ.6.26 కోట్లు, రూ.64 లక్షలు తిరిగి కేఎస్‌ఎస్‌పీఎల్‌ డైరెక్టర్లుగా ఉన్న టి.బాలాజీ, పి.అనిల్‌కుమార్‌లకు చెందిన వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లినట్లు తేలింది. కేఎస్‌ఎస్‌పీఎల్‌ సంస్థ నకిలీ ఇన్వాయిస్‌లతో మరో రూ.4.16 కోట్లను బోగస్‌ సంస్థల పేరుతో మళ్లించినట్లు బయటపడింది. దీంతో కేఎస్‌ఎస్‌పీఎల్‌ సంస్థకు అనేక నోటీసులు జారీ చేసిన యాక్సస్‌ బ్యాంక్‌ లావాదేవీలకు సంబంధించిన పత్రాలు అందించాల్సిందిగా కోరినా స్పందించలేదు. ఎట్టకేలకు మోసం జరిగినట్లు నిర్థారించిన యాక్సిస్‌ బ్యాంక్‌ పోలీసులను ఆశ్రయించడానికి నిర్ణయించింది. బేగంపేటలోని మెగా హోల్‌సేల్‌ బ్యాంకింగ్‌ సెంటర్‌ అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌.వరుణ్‌ కుమార్‌ కేఎస్‌ఎస్‌పీఎల్‌ సంస్థతో పాటు డైరెక్టర్లుగా ఉన్న టి.బాలాజీ, పి.అనిల్‌ కుమార్‌లపై సీసీఎస్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా గత వారం కేసు నమోదు చేసుకున్న ఎస్‌ఐ గుర్రం అనిల్‌ కుమార్‌ దర్యాప్తు ప్రారంభించారు.

ఫోరెన్సిక్‌ ఆడిట్‌ ద్వారా ఇది గుర్తించిన అధికారులు

నగర నేర పరిశోధన విభాగంలో ఫిర్యాదుతో కేసు

నిందితుల జాబితాలో ఇద్దరు డైరెక్టర్లు సైతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement