నాలా ఆక్రమణలు తొలగించిన హైడ్రా
మియాపూర్: మియాపూర్ మదీనాగూడలోని శ్రీ చైతన్య విద్యాసంస్థ ప్రాంగణంలో ఉన్న నాలా ఆక్రమణలను హైడ్రా అధికారులు ఆదివారం తొలగించారు. నాలాను అక్రమించి నాలాలో పోసిన మట్టిని హైడ్రా సీఐ బాలగోపాల్ పర్యవేక్షణలో మియాపూర్ పోలీస్ బందోబస్తు మధ్య డీఆర్‌ఎఫ్ సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో తొలగించారు. నాలా విస్తరణకు అడ్డుగా ఉన్న క్రీడా మైదానంలో వాకింగ్ ట్రాక్‌ను కూడా తొలగించారు. మియాపూర్ పటేల్ చెరువు నుండి గంగారం చెరువుకు వెళ్లే నాలాను శ్రీ చైతన్య విద్యాసంస్థ అక్రమించి..మరో వైపు నుండి నాలాను మళ్లించి ప్రాంగణంలో ఉన్న నాలాలో మట్టి నింపారని ఇరిగేషన్ అధికారులు, స్థానిక ప్రజలు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. దీంతో హైడ్రా అధికారులు ఆదివారం ఆక్రమణలు తొలగించారు. ఈ క్రమంలో ఇది తమ స్థలమని, గతంలో నాలాకు దారి ఇచ్చామని, దానిని మరో పక్కకు మార్చి ఈ నాలాను పూడ్చామని చైతన్య కళాశాల యాజమాన్యం హైడ్రా సిబ్బందిని అడ్డుకున్నారు. ఎస్‌ఎన్‌డీపీ ధీరజ్, హైడ్రా సీఐ బాలగోపాల్, కళాశాల యాజమాన్యానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
మియాపూర్ పీఎస్‌లో కేసు నమోదు
నాలా ఆక్రమణకు పాల్పడిన శ్రీ చైతన్య విద్యాసంస్థ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులు శనివారం మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


