రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్రగాయాలు
లంగర్‌హౌస్: లంగర్‌హౌస్ పరిధిలోని టిప్పుఖాన్ వంతెనపై కారు పల్టీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాల్లోకి వెళ్తే..వికారాబాద్‌లో నివాసముండే జనార్దన్ వృత్తిరీత్యా రియల్‌ఎస్టేట్ వ్యాపారి. థార్ కారు కొని సంవత్సరం పూర్తి కావడంతో ఆదివారం ఉదయం యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహుని దర్శనానికి వెళ్లాడు. అనంతరం స్నేహితులతో మద్యం తాగి నగరంలో వారిని వదిలి..లంగర్‌హౌస్ మీదుగా సాయంత్రం వికారాబాద్‌కు బయలుదేరాడు. టిప్పుఖాన్ బ్రిడ్జి పైకి రాగానే ముందు బ్రిడ్జి దారి చిన్నగా ఉండటంతో గమనించి కారును పక్కకు తిప్పే ప్రయత్నంలో పల్టీ కొట్టింది. దీంతో జనార్దన్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు 108కు ఫోన్‌చేయగా అంబులెన్స్‌తో సిబ్బంది అక్కడకు చేరుకున్నారు. కాగా ఈ సమయంలో బాధితుడికి, 108 సిబ్బందికి చిన్న వాగ్వాదం జరిగింది. తన తల్లికి ఫోన్ చేయాలని బాధితుడు కోరగా..ముందు అంబులెన్స్ ఎక్కాలని సూచించారు. బాధితుడు తమ మాట వినడం లేదని 108 సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనిపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వారు మాటమార్చి ఇది హైదరాబాద్ వాహనం కాదని, రంగారెడ్డి జిల్లా వాహనం అంటూ అక్కడి నుండి వాహనం తీసుకొని వెళ్లిపోయారు. చివరకు లంగర్‌హౌస్ పోలీసులు అక్కడకు చేరుకొని బాధితుడిని గోల్కొండ ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం ఆటోలో తరలించారు.
పల్టీ కొట్టిన కారు
నిర్లక్ష్యంగా వ్యవహరించిన 108 సిబ్బంది
స్థానికుల ఆగ్రహం


