సమాజ ఉన్నతికి జర్నలిజం తోడ్పడాలి
● మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి
హిమాయత్‌నగర్: జర్నలిజం అనేది సామాజిక ధృక్పథం కలిగి ఉండి..సమాజం ఉన్నతికి తోడ్పడాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆదివారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యక్షుడు ములుగు రాజేశ్వర్ రావు రచించిన ‘నేను–బహువచనం(ఆత్మకథ)’, ‘అధినాయక జయహే(కవితా సంకలనం)’ పుస్తకాల ఆవిష్కరణ కార్యక్రమం సంఘం అధ్యక్షులు దాసు కేశవరావు అధ్యతక్షన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ రాజేశ్వర్‌రావు రచనలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయన్నారు. తెలంగాణ మీడియా అకాడమీ తరపున 12 మంది ప్రముఖ జర్నలిస్టుల పుస్తకాలు ఆవిష్కరించనున్నట్లు శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. పత్రికలకు సంబంధించిన సుమారు 5 లక్షల పేజీలను ఆన్‌లైన్‌లో చూసేందుకు ఆకాడమీ ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. విశ్రాంత ఐఏఎస్ అధికారి డా.మోహన్ కందా మాట్లాడుతూ సమాజంలో మీడియాదే కీలక పాత్ర అని, మీడియా బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. సీనియర్ జర్నలిస్ట్ వినయ్ కుమార్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్, వయోధిక పాత్రికేయ సంఘం ఉపాధ్యక్షులు టి.ఉడయవర్లు, సీనియర్ జర్నలిస్టు జి.వల్లీశ్వర్, ఎమెస్కో సంపాదకులు డి.చంద్రశేఖర్ రెడ్డి, సంఘం కార్యదర్శి కె.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.


