పోలీస్ రవాణా విభాగంలో మెరుగైన వసతులు : డీజీపీ
అంబర్‌పేట: పోలీస్ రవాణా విభాగంలో మెరుగైన వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. ఆదివారం అంబర్‌పేట సీపీఎల్‌లో ఇండియన్ ఆయిల్ సంస్థకు చెందిన పెట్రోల్ పంపు నిర్మాణం పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ పోలీస్ సేవల్లో రవాణా వసతులు ఎంతో కీలకమన్నారు. తెలంగాణ వ్యాప్తంగా పోలీస్ విభాగంలో ఉన్న రవాణా సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం రూ.51 కోట్ల నిధులు కేటాయించిందన్నారు. పోలీస్ విభాగం వాహనాలతో పాటు పోలీస్ సిబ్బందికి ఇక్కడ నిర్మించనున్న పెట్రోల్ పంపు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఐజీ డాక్టర్ ఎం.రమేష్, నగర పోలీస్ కమిషనర్ సజ్జనర్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థ ప్రతినిధులు పియూష్ మిట్టల్, బద్రినాథ్, ముత్తుకుమారన్ తదితరులు పాల్గొన్నారు.


