
నిమజ్జనానికి ప్రత్యేకంగాబేబీపాండ్స్ ఏర్పాటు
బంజారాహిల్స్: రాబోయే గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై నగర పోలీసు కమిషనరేట్‌లోని టీజీఐసీసీ భవనంలో గురువారం సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, వాటర్‌వర్క్స్, విద్యుత్, ఆర్టీసీ, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు అధికారులు, హైడ్రా, అగ్నిమాపక, పర్యాటక శాఖ, సమాచార శాఖ, రవాణా, వైద్య శాఖలతో పాటు ఇతర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి, ఖైరతాబాద్ బడా గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులు పలు సమస్యలపై మాట్లాడారు.ఈ సమస్యలపై స్పందించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ మాట్లాడుతూ విగ్రహాల నిమజ్జనానికి ప్రత్యేకంగా బేబీపాండ్స్, క్రేన్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. 160 స్పెషల్ యాక్షన్ టీమ్‌లను ఏర్పాటుచేశామని చెప్పారు. గణేష్ నవరాత్రుల సందర్భంగా పెండింగ్‌లో ఉన్న ప్రతి సమస్యనూ పరిష్కరించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు. అదనంగా అంబులెన్స్‌లు, అగ్నిమాపక బృందాలు, మొబైల్ టాయిలెట్స్, అదనపు విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లు, మంచినీటి సరఫరా వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నిమజ్జనం రోజు కోసం బారీకేడ్‌లను సమకూరుస్తామని తెలిపారు. మెట్రోరైలు అధికారులు కూడా అర్ధరాత్రి వరకు అదనపు ట్రిప్పులు నడిపిస్తామని తెలిపారు. టీజీఐసీసీసీ డైరెక్టర్ వీబీ కమలాసన్‌రెడ్డి మాట్లాడుతూ మూడు కమిషనరేట్ల పరిధిలోని సీసీ కెమెరాలను అనుసంధానం చేశామని, అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ఇక్కడి నుంచే నిఘా కొనసాగుతుందని తెలిపారు. నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మాట్లాడుతూ విగ్రహాల నిమజ్జనానికి సంబంధించి కోర్టు ఆదేశాలను తప్పకుండా పాటించాలని మండప నిర్వాహకులను కోరారు. అలాగే మండప నిర్వాహకులు తమ విగ్రహాల వివరాలను సంబంధిత పోలీసు అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. అడిషనల్ సీపీ విక్రమ్‌సింగ్ మాన్, అడిషనల్ సీపీ క్రైమ్ విశ్వప్రసాద్, హైడ్రా కమిషనర్ ఆర్‌వీ రంగనాథ్, సైబరాబాద్ జాయింట్ సీపీ గజరారావు భూపాల్ భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి, శశిధర్‌రెడ్డి, సందీప్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు.
గ్రేటర్ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్