
2026–27 నుంచి సీబీఎస్‌ఈ స్కూళ్లలో అమలు
తొలి విడతలో 9వ తరగతి విద్యార్థులకు మాత్రమే
బోర్డ్ సూచించిన పుస్తకాలు పరీక్షకు అనుమతి
ప్రత్యేక ప్రశ్నపత్రం రూపకల్పనపై కసరత్తు
2014 నుంచి మొదలైన ఓపెన్ బుక్ ట్రయల్స్
పఠన సామర్థ్యం పెరుగుతుందంటున్న అధ్యయనాలు
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) 2026–27 సంవత్సరం నుంచి ఓపెన్ బుక్ పరీక్ష విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. తొలుత దీన్ని 9వ తరగతికే పరిమితం చేయాలని నిర్ణయించింది. సీబీఎస్‌ఈ గవర్నింగ్ బాడీ ఇటీవల ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా సీబీఎస్‌ఈ స్కూళ్లలో చదివే 9వ తరగతి విద్యార్థులు 18 లక్షల వరకు ఉంటారు.
వీళ్లంతా 2026లో జరిగే వార్షిక పరీక్షలను బోర్డ్ సూచించిన పుస్తకాలు చూసి రాయవచ్చు. కోవిడ్ తర్వాత వచ్చిన మార్పుల్లో భాగంగా ఈ విధానం అవసరమని బోర్డ్ భావించింది. జాతీయ విద్యావిధానం–2020లో కూడా పరోక్షంగా దీన్ని సూచించింది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా ఓపెన్ బుక్ విధానంపై మంచి ఫలితాలు సాధిస్తున్నాయని సీబీఎస్‌ఈ బోర్డ్ అధ్యయనం ద్వారా వెల్లడించింది. - సాక్షి, హైదరాబాద్
ఎందుకీ విధానం?
ఓపెన్ బుక్ విధానం ఉపయోగాలపై సీబీఎస్‌ఈ స్పష్టత ఇచ్చింది. దీనివల్ల విద్యార్థుల్లో పరీక్షల భయం పోతుంది. సమాధానం తెలిసినా పరీక్ష సమయంలో మర్చిపోతుంటారు. పరీక్ష కేంద్రంలో ఓసారి రీకాల్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. పరీక్షలో సమాధానాలు పాఠ్యపుస్తకాల నుంచే రాయాలి. కాబట్టి విద్యార్థి ముందు నుంచే పుస్తకం చదివే అలవాటు చేసుకుంటాడు. దీనివల్ల బట్టీ పట్టే విధానం కాకుండా, సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది. ఈ అలవాటుతో విద్యార్థి పోటీ పరీక్షల్లో చురుకుగా పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యార్థిలో సృజనాత్మకత పెరుగుతుందని బోర్డ్ భావిస్తోంది.
పరీక్ష ఎలా ఉంటుంది?
ఈ పరీక్ష కోసం బోర్డ్ ప్రత్యేక ప్రశ్నపత్రాన్ని రూ పొందిస్తుంది. సాధారణంగా ఉండే పరీక్ష సమ యాన్ని గంటకు కుదిస్తారు. పరీక్షకు బోర్డ్ సూచించిన పుస్తకాలను అనుమతిస్తారు. పాఠ్యపుస్త కాలు, క్లాస్ నోట్స్, కొన్ని రకాల మెటీరియల్స్‌ను తీసుకెళ్లే అవకాశం కల్పిస్తారు. అయితే, పరీక్షలో ఇచ్చే ప్రశ్న లు నేరుగా కాకుండా, ట్విస్ట్ చేసి ఇస్తా రు. ఏ కోణం నుంచి ప్రశ్నలు వచ్చినా సమాధానం ఇచ్చే నేర్పు విద్యార్థుల్లో ఉండాలి. చాప్టర్ పూర్తిగా చదవడం, దా న్ని విశ్లేషణాత్మకంగా ముందు నుంచి అధ్య యనం చేస్తేనే ఓపెన్ బుక్ విధానంలో తేలికగా పరీక్ష రాయగలుగుతారని నిపుణులు చెబుతున్నారు. ఓ రకంగా క్రిటికల్ థింకింగ్ ఉంటేనే పరీక్ష సులువు అవుతుంది.
2014 నుంచి కసరత్తు
సీబీఎస్‌ఈ ఈ విధానంపై 2014 నుంచి కసరత్తు చేస్తోంది. దీనికోసం కొన్ని స్కూళ్లను ఎంపిక చేసింది. ఆ సూళ్ల విద్యా ర్థులకు 9వ తరగతిలో హిందీ, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్ సైన్స్.. 11వ క్లాస్ విద్యార్థులకు ఎకనమిక్స్, బయా లజీ, జాగ్రఫీ సబ్జెక్టుల్లో ఓపెన్ బుక్ పరీక్షలు నిర్వహించింది. దీనివల్ల 85% మంది విద్యార్థుల్లో పరీక్షలపై భయం పోయి, పఠన సామర్థ్యం పెరిగిందని గుర్తించారు. 2023లో అన్ని పరీక్షలపై బోర్డ్ అధ్యయనం చేసింది.
ఎక్కడ ఎలా ఉంది?
» అమెరికా, బ్రిటన్‌లో పలు విశ్వవిద్యాలయాలు ఓపెన్ బుక్ విధానంపై అధ్యయనం చేశాయి. చదువులో వెనుకబడ్డ విద్యార్థి ఈ విధానం వల్ల మంచి ఫలితాలు సాధించినట్టు ఎక్స్‌లెన్స్ జర్నల్‌లో రచయితలు మమత, నితిన్ పిళ్లై పేర్కొన్నారు.
» ఢిల్లీ యూనివర్సిటీ 2020 ఆగస్టు, 2022 మార్చిలో ఈ తరహా పరీక్షలు నిర్వహించింది. ఈ వర్సిటీ దీనిపై ఇంకా అధ్యయనం చేస్తోంది. తాజాగా కేరళ ఉన్నత విద్య విభాగం కూడా ఇంటర్నల్స్, ప్రాక్టికల్స్‌కు ఓపెన్ బుక్ విధానాన్ని సూచించింది.
» ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, భువ నేశ్వర్ 98 మంది వైద్య విద్యార్థులకు ఈ విధానంలో పరీక్షలు నిర్వహించింది. వీరిలో 78.6% ఉత్తీర్ణులయ్యా రు. వీరిలో మానసిక ఒత్తిడి దూరమైందని ఎయిమ్స్ పేర్కొంది.