
వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న మంత్రి పొంగులేటి. చిత్రంలో సీఎస్ రామకృష్ణారావు
వరద సహాయక చర్యలకు జిల్లాకు రూ.కోటి
ఉమ్మడి పది జిల్లాలకు ప్రత్యేక సీనియర్ అధికారులు
అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేయండి
కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు మరో 24 గంటల వరకు మరింత అప్రమత్తంగా ఉండాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు. ఏవిధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. గడిచిన మూడు రోజుల్లో కొన్ని ప్రాంతాల్లో ఊహించిన దానికంటే ఎక్కువ వర్షాలు కురిశాయని, దానిని దృష్టిలో పెట్టుకొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
సీఎం రేవంత్‌రెడ్డి సూచనల మేరకు వర్షాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో కలసి గురువారం సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎస్పీలతో మంత్రి శ్రీనివాస్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 10 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, భూపాలపల్లి, ములుగు, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో పరిస్థితులపై కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. రాబోయే 24 గంటల్లో రెడ్ అలర్ట్ జోన్‌లో ఉన్న మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు.
సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు రూ.కోటి విడుదల చేశామని, అవసరమైతే మరిన్ని నిధులు ఇస్తామని తెలిపారు. సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్లు గుర్తుచేశారు. అధికారులు, సిబ్బంది సెలవులను రద్దుచేయాలని కలెక్టర్లను ఆదేశించారు.
గ్రేటర్ హైదరాబాద్‌లో మున్సిపల్, మెట్రో వాటర్ బోర్డు, ట్రాఫిక్ విభాగాలు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, లో లెవెల్ బ్రిడ్జీల దగ్గర పోలీస్ సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. అంటువ్యాధులు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని, తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. చిన్నపాటి వర్షాలకే ముంపునకు గురవుతున్న ప్రాంతాల ప్రజలకు వేరేచోట్ల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని సూచించారు.