హైడ్రా టైం టేబుల్‌ సిద్ధం! | - | Sakshi
Sakshi News home page

హైడ్రా టైం టేబుల్‌ సిద్ధం!

May 16 2025 6:25 AM | Updated on May 16 2025 6:25 AM

హైడ్రా టైం టేబుల్‌ సిద్ధం!

హైడ్రా టైం టేబుల్‌ సిద్ధం!

సోమవారం నుంచి శనివారం వరకు పని ప్రణాళికలు

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీకి (హైడ్రా) ఓ టైమ్‌ టేబుల్‌ సిద్ధమైంది. వారంలో ఏ రోజు ఏ పని చేయాలి? అనేది కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ నిర్దేశించారు. దీనికి అనుగుణంగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారం, హైడ్రా సంస్థాగత నిర్మాణం, క్షేత్ర స్థాయి పరిశీలన.. ఇలా ప్రతి అంశానికీ సమప్రాధాన్యం ఇస్తూ ఈ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ వారం నుంనే ఈ విధానాలను అమలులోకి తీసుకువచ్చారు. మరోపక్క హైడ్రా కోసం ఇటీవల కొనుగోలు చేసిన 122 వాహనాలను అధికారులు, సిబ్బందికి అందజేశారు.

సోమవారం ప్రజావాణితో మొదలై..

రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌లో ఉన్న హైడ్రా ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఆరోజు ఔటర్‌ రింగ్‌రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) వరకు ఉన్న వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదుదారులు వస్తున్నారు. ప్రతి వారం కనీసం 50 నుంచి 60 మంది వస్తుండటంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు సమయం పడుతోంది. చెరువుల ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ (ఎఫ్‌టీఎల్‌), బఫర్‌ జోన్‌ సహా వివిధ అంశాల గుర్తింపునకు హైడ్రా నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ తో పాటు ప్రముఖ సంస్థల సహకారం తీసుకుంటోంది. ఆయా ఏజెన్సీల ద్వారా సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తోంది. ఈ అంశాల పురోగతిని పర్యవేక్షించడానికి హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ ప్ర తి మంగళవారం రివ్యూలు ఏర్పాటు చేస్తున్నారు.

కీలక ఫిర్యాదులపై క్షేత్రస్థాయి పర్యటన..

ప్రజావాణితో పాటు ఇతర విధానాల్లో హైడ్రాకు అందిన ఫిర్యాదులను అధికారులు అన్ని కోణాల్లోనూ పరిశీలిస్తున్నారు. దీనికోసం రెవెన్యూ, న్యాయశాఖ సహా వివిధ విభాగాల నుంచి అధికారులు డిప్యుటేషన్‌పై హైడ్రాలో పని చేస్తున్నారు. సున్నితమైన, కీలకాంశాలను స్వయంగా హైడ్రా కమిషనర్‌ పర్యవేక్షిస్తున్నారు. దీనికోసం ప్రతి బుధవారం క్షేత్రస్థాయి పర్యటనలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే బుధవారం ఉదయం రంగారెడ్డి జిల్లా కోహెడ నుంచి పర్యటన మొదలు పెట్టిన రంగనాథ్‌ రాత్రి 7.30 గంటలకు మేడ్చల్‌ జిల్లా బౌరంపేటతో ముగించారు. గురువారం హైడ్రా పరిపాలన పరమైన అంశాలపై దృష్టి పెడుతున్న కమిషనర్‌ అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులు, వాటి పురోగతి, తీసుకున్న/తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రతి శనివారం హైడ్రా ఆధ్వర్యంలో వర్క్‌షాప్స్‌ నిర్వహిస్తున్నారు. వీటిని నిపుణులతో పాటు మాజీ, ప్రస్తుత అధికారులను ఆహ్వానిస్తున్నారు. ఈ శనివారం నగరంలోని నాలాలపై చేపట్టాలని నిర్ణయించారు.

ఒక్కో రోజు ఒక్కో పని చేసేలా కమిషనర్‌ ఆదేశాలు

స్వయంగా పర్యవేక్షిస్తున్న ఏవీ రంగనాథ్‌

అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందికి వాహనాల కేటాయింపు

ద్విచక్ర వాహనంతో పాటు హెల్మెట్‌ సైతం..

డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌) బలగాలతో పాటు హైడ్రాలో పని చేసే అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది కోసం హైడ్రా 122 వాహనాలు ఖరీదు చేసింది. వీటిలో 21 ట్రక్కుల్ని కేవలం ప్రకృతి వైపరీత్యాలు, రెస్క్యూ కార్యకలాపాలకే వినియోగించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రత్యేక ఉపకరణాలను వాహనంలో అందుబాటులో ఉంచారు. ఉన్నతాధికారులు, అధికారుల కోసం నాలుగు ఇన్నోవా క్రిస్టాలు, 55 స్కార్పియోలు ఖరీదు చేశారు. డీఆర్‌ఎఫ్‌తో పాటు అసెట్‌ ప్రొటెక్షన్‌ విభాగానికి చెందిన సిబ్బంది తరలింపు కోసం ఐదు మినీ బస్సుల్ని ఖరీదు చేశారు. క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తించే సిబ్బంది వినియోగించడానికి 37 ద్విచక్ర వాహనాలు కొన్నారు. ఈ వాహనాలను అధికారులు, సిబ్బందికి కేటాయింపు పూర్తి చేశారు. కమిషనర్‌ రంగనాథ్‌ ఆదేశాల మేరకు ద్విచక్ర వాహనంతో పాటు కచ్చితంగా హెల్మెట్‌ కూడా పంపిణీ చేశారు. వాహనం నడిపే సమయంలో కచ్చితంగా దాన్ని ధరించాలని స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement