ఆరుగంటల్లో పట్టేశారు.. | Sakshi
Sakshi News home page

ఆరుగంటల్లో పట్టేశారు..

Published Thu, Feb 29 2024 7:46 PM

-

పద్మారావునగర్‌లో చైన్‌స్నాచింగ్‌

నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌

చిలకలగూడ : చిలకలగూడ ఠాణా పరిధిలోని పద్మారావునగర్‌లో బుధవారం మధ్యాహ్నం చైన్‌ స్నాచింగ్‌కు పాల్పడిన వ్యక్తిని 6 గంటల్లో ఈస్ట్‌ జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పద్మారావునగర్‌ స్కందగిరి ఆలయ సమీపంలోని ఇంట్లో వృద్ధురాలు తుల్జాబాయి (80) ఒంటరిగా నివాసం ఉంటోంది. బుధవారం మధ్యాహ్నం ఆమె ఇంటి తలుపులు తెరిచి హాల్‌లో కూర్చుని టీవీ చూస్తోంది. అదే సమయంలో ద్విచక్ర వాహనంపై వచ్చిన దుండగుడు ప్రహరీ దూకి హాల్‌లోకి ప్రవేశించాడు. ఎవరు, ఎందుకువచ్చావని ప్రశ్నించేలోగా, ఆమె నోరు మూసి మెడలోని నాలుగు తులా ల బంగారు గొలుసు లాక్కుని పరారయ్యాడు. దీంతో షాక్‌కు గురైన తుల్జాబాయి కొద్దిసేపటి తర్వాత తేరుకుని గట్టిగా కేకలు వేడయంతో స్ధానికులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడి కోసం పరిసర ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా రాత్రి 9 గంటల సమయంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడికి ఇతర కేసులతో సంబంధం ఉందా అనే కోణంలో విచారణ చేపట్టారు. గురువారం నిందితుడిని మీడియా ఎదుట హాజరుపరచనున్నట్లు సమాచారం.

సోలార్‌ ప్యానెల్‌ ఏర్పాటుతో ఉచిత విద్యుత్‌

సాక్షి,సిటీబ్యూరో: కేంద్ర ప్రభుత్వ పీఎం సూర్యఘర్‌ ముఫ్ట్‌ బిజిలీ యోజన పథకం కింద సోలార్‌తో 300 యూనిట్స్‌ ఉచిత విద్యుత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పోస్టల్‌ శాఖ సికింద్రాబాద్‌ డివిజన్‌ సీనియర్‌ సూపరిటెండెంట్‌ సుబ్రమణ్యం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పథకం కింద గృహాల పైకప్పులపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేసుకునేందుకు అయ్యే ఖర్చులో సుమారు 40 శాతం వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ఇందుకోసం పోస్టల్‌శాఖ నిర్వహించే సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఇందుకు దగ్గర్లోని పోస్ట్‌ ఆఫీస్‌, లేదా పోస్ట్‌మ్యాన్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement